PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 9:20 pm Posted by : Praja Sankshemam News

నల్లగొండ అభివృద్ధికి రూ.197.44 కోట్ల నిధులు మంజూరు:

ప్రపంచ బ్యాంకు సహకారంతో పట్టణాభివృద్ధికి భారీ ప్రణాళిక.. ఆధునిక హంగులతో గడియారం సెంటర్
ప్రజా సంక్షేమం న్యూస్ | నల్లగొండ ప్రతినిధి:

నల్లగొండ నగర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) పరిధిలో తెలంగాణ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ జాబ్స్ ప్రోగ్రామ్ (TUTJP) కింద ప్రపంచ బ్యాంకు సహకారంతో నల్లగొండ పట్టణ అభివృద్ధికి రూ.197.44 కోట్ల పరిపాలనా అనుమతులు లభించాయి.ఈ ప్రాజెక్టు వ్యయంలో ప్రపంచ బ్యాంకు 70 శాతం వాటాగా రూ.138.21 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వాటాగా రూ.59.23 కోట్లు సమకూర్చనున్నాయి. ఈ నిధులతో నగర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమమైంది.
ఆధునిక హంగులతో గడియారం సెంటర్:నల్లగొండ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన చారిత్రక గడియారం సెంటర్‌ను ఆధునిక హంగులతో సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆకర్షణీయమైన నమూనాను విడుదల చేశారు. నగరానికి కొత్త రూపురేఖలు తీసుకొచ్చేలా ఈ అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు.
మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక చొరవ:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో నల్లగొండ నగర అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు కావడంపై నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ బంగారు నల్లగొండ నిర్మాణానికి కృషి చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచ బ్యాంకు సహకారం.. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం.. మంత్రి కోమటిరెడ్డి కృషితో నల్లగొండ నగరాన్ని మరింత సుందరంగా, ఆధునికంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందడుగు పడుతోంది.