PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 11:30 am Posted by : Praja Sankshemam News

నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కొల్లి సత్యనారాయణ

పీడీఎఫ్ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటన.. ప్రజా సంఘాల మద్దతు
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:

నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఉమ్మడి అభ్యర్థిగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణను ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అభ్యర్థి ప్రకటన, పరిచయ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ డబ్బు, మద్యానికి అతీతంగా ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన అభ్యర్థులను పట్టభద్రులు ఎన్నుకోవాలని సూచించారు. గతంలో పీడీఎఫ్‌ నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించేవారని గుర్తుచేశారు. అదే తరహాలో ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు వామపక్ష భావజాలం కలిగిన ప్రజా సంఘాలన్నీ ఏకమై కొల్లి సత్యనారాయణను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టినట్లు తెలిపారు.
ఓటర్ల నమోదు పెంచాలి: మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి:
మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ కొల్లి సత్యనారాయణ అభ్యర్థిత్వానికి ప్రజా సంఘాలన్నీ మద్దతుగా నిలిచి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఉమ్మడి మూడు జిల్లాల్లో పట్టభద్ర ఓటర్ల సంఖ్య గతంలో సుమారు 5.5 లక్షలుగా ఉండగా, ప్రస్తుతం 2.90 లక్షల మంది మాత్రమే నమోదైనట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు అయ్యేలా సంఘాలు చొరవ చూపాలని సూచించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజా ప్రతినిధులు అవసరం:
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నవారు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సంఘాలు ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించడం ప్రత్యామ్నాయ రాజకీయాలకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు నుంచి ఎన్నికల ప్రచారం వరకు సీఐటీయూ శ్రేణులు కృషి చేస్తాయని తెలిపారు.టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎల్‌. పద్మ, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, టాప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ తదితరులు కొల్లి సత్యనారాయణ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, దళితులు, గిరిజనులు, పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించాల్సిన అవసరాన్ని వారు వివరించారు.
బాధ్యతను నిర్వర్తిస్తా:కొల్లి సత్యనారాయణ
ప్జా సంఘాలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కొల్లి సత్యనారాయణ తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు, న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తుతానన్నారు. ఓటర్ల నమోదు నుంచి పోలింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలని పట్టభద్రులను కోరారు.
ప్రచారానికి సీఐటీయూ రూ.లక్ష విరాళం:కొల్లి సత్యనారాయణ ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం సీఐటీయూ రాష్ట్ర కమిటీ తొలి విడతగా రూ.లక్ష విరాళాన్ని ప్రకటించింది. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఈ విషయాన్ని వెల్లడించారు.కార్యక్రమంలో ఐలూ, టీఎస్‌యూటీఎఫ్, సీఐటీయూ, ఐద్వా, కేవీపీఎస్, డీవైఎఫ్‌ఐతో పాటు పలు ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, మహిళా, గిరిజన, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొని మద్దతు తెలిపారు.