వైద్య పరీక్షలు, మందులు అందుబాటులో లేవని ఆరోపణ
ప్రజాసంక్షేమం న్యూస్ రామన్నపేట:మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆస్పత్రిని పరిశీలించారు. సామాన్య ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.టీడీపీ మండల ఇంచార్జ్ మీర్జా పజిల్ బేగ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహణ కార్యదర్శి నకిరేకంటి గణేష్, మండల నాయకులు బత్తుల సత్యం, వడ్లకొండ సత్తయ్య ఆస్పత్రిని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.ఆస్పత్రిలో సుమారు 20 రోజులుగా వైద్య పరీక్షలు నిర్వహించడం లేదని, అవసరమైన మందులు, ఇంజక్షన్లు అందుబాటులో లేవని వారు ఆరోపించారు. గాయాలకు సంబంధించిన మందులు, ఆయింట్‌మెంట్లు కూడా లభించని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. సరైన పరీక్షలు నిర్వహించకుండా వైద్యం అందించడం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఆస్పత్రిలో అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల వైద్య హక్కుల కోసం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేపడతామని వారు తెలిపారు.