ప్రజాసంక్షేమం న్యూస్ సదాశివపేట:
సదాశివపేట మండల పరిధిలో గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమ వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. పట్టణంలో నిర్వహిస్తున్న ‘హేమా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీ’ డెలివరీ బాయ్స్ నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల నుంచి అదనపు నగదు వసూలు చేస్తుండటంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనల ప్రకారం వినియోగదారులు చెల్లించే సిలిండర్ బిల్లు మొత్తంలోనే హోమ్ డెలివరీ ఛార్జీలు కలిసి ఉంటాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నప్పటికీ, ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా తయారైంది. ఇంటికి సిలిండర్ డెలివరీ చేసే సమయంలో ప్రతీ సిలిండర్‌పై రూ. 40 నుంచి రూ. 60 వరకు అదనంగా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
అదనపు ఛార్జీలు ఎందుకని ప్రశ్నిస్తే రవాణా ఖర్చులు, వాహన ఖర్చులంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, డబ్బులు ఇవ్వకపోతే సిలిండర్లు దించకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ విషయమై ఆర్.టి.ఐ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి ఎండి ఖాజా మొయినొద్దీన్ మాట్లాడుతూ.. గ్యాస్ ఏజెన్సీల అక్రమ వసూళ్ల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న హేమా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని, అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.