6న జిల్లా కేంద్రాల్లో నిరసనలు.. కలెక్టరేట్ల ముట్టడి
8న చలో లోక్‌భవన్.. నవంబర్ 1న చలో ఢిల్లీ
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై నిరసన వ్యక్తం చేస్తూ తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి తెలంగాణ నేతలు నిర్ణయించారు. పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీభవన్‌లో కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.సమావేశంలో బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఉద్యమ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు నేతలు తెలిపారు. SIR ప్రక్రియ పేరుతో పేద ప్రజల ఓట్లు తొలగించే చర్యలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
6న జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు:ఈ నెల 6న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి, కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం 8న చలో లోక్‌భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
నవంబర్ 1న చలో ఢిల్లీ:SIR ప్రక్రియపై తమ అభ్యంతరాలను జాతీయ స్థాయిలో వినిపించేందుకు నవంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల జాబితా సవరణలో అర్హులైన ఓటర్ల హక్కులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కూటమి నేతలు డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, టీజేఎస్ యువజన విభాగం అధ్యక్షుడు సలీం పాషా, సీపీఐ నాయకులు ఈటీ నర్సింహ, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.కాగా, కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్‌లో SIR-2026కు సంబంధించిన ఓటర్ల సేవలు, ఓటరు జాబితా శోధన, అభ్యంతరాలు/దావాల ప్రక్రియకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉన్నాయి.