PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 2:39 pm Posted by : Praja Sankshemam News

SIR అక్రమాలపై కోదండరాం మౌన దీక్ష

ఓటు హక్కు పరిరక్షణకు ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలి
అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే వరకు పోరాటం
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్
: గాంధీ జయంతిని పురస్కరించుకుని నాంపల్లిలోని తెలంగాణ జన సమితి (TJS) రాష్ట్ర కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో నిర్వహించిన మౌన దీక్షలో పాల్గొన్నట్లు నేతలు తెలిపారు. SIR ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ చేపట్టిన ఈ దీక్షలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సామాన్య ప్రజలకు అందించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు అని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, SIR ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అవకతవకలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళన కలిగించే అంశాలుగా మారాయని అన్నారు.యువత, మహిళలు, దళితులు, ఆదివాసీల ఓట్ల తొలగింపునకు దారితీసే విధంగా SIR ప్రక్రియ సాగకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రైవేట్ సంస్థల పాత్ర, కొత్త ఓటర్ల నమోదులో విధిస్తున్న ఆంక్షలపై పారదర్శకత అవసరమని అన్నారు. ఓటర్ల నమోదు, సాంకేతిక నిర్వహణలో పూర్తి స్పష్టత, జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేశారు.గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో గాంధీ ఘాట్ వేదికగా హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తితో, ప్రస్తుతం పౌరుల ఓటు హక్కు పరిరక్షణకు కూడా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కోదండరాం చేపట్టిన మౌన దీక్షను ఒక పార్టీకి పరిమితమైన కార్యక్రమంగా కాకుండా పౌరుల హక్కుల కోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌తో పాటు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, పౌర సమాజం కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే వరకు, SIR ప్రక్రియలో పూర్తి పారదర్శకత వచ్చే వరకు ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.