రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల కొత్త చేయూత పింఛన్లు మంజూరు
సంగారెడ్డి జిల్లాలో 18,591 మందికి.. అందోల్ నియోజకవర్గంలో 3,130 మందికి కొత్త పింఛన్లు
అందోల్‌లో రూ.95 కోట్లతో ఫార్మసీ, లా కళాశాలల ఏర్పాటు
నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీలో మంత్రి దామోదర రాజనర్సింహ
అందోల్, నవంబర్ 16 (ప్రజాసంక్షేమం న్యూస్):
సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేస్తోందని తెలిపారు.సోమవారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సంగుపేట ఎక్స్ రోడ్డులోని శ్రీలక్ష్మీదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందోల్-జోగిపేట మున్సిపాలిటీతో పాటు అందోల్, చౌటకూర్, పుల్కల్, వట్పల్లి మండలాలకు చెందిన నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.50 లక్షల చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 18 వేలకుపైగా, అందోల్ నియోజకవర్గంలో 3 వేలకుపైగా కొత్త పింఛన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులకు పింఛన్లు ఆర్థిక భరోసా కల్పిస్తూ గౌరవప్రదమైన జీవనానికి తోడ్పడతాయని పేర్కొన్నారు.
పేదల సంక్షేమానికి పెద్దపీట:పేదలకు సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు, అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. అందోల్ నియోజకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు సుమారు వెయ్యి ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. సొంత స్థలం ఉన్నవారితో పాటు స్థలం లేని నిరుపేదలకు కూడా ఇళ్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం!మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కోటీశ్వరులుగా ఎదగాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, డ్రోన్ల నిర్వహణ వంటి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. హుమ్నాపూర్‌లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
విద్యా హబ్‌గా అందోల్ నియోజకవర్గం:అందోల్ నియోజకవర్గాన్ని విద్యా హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. అందోల్ గుట్ట వద్ద రూ.60 కోట్లతో ఫార్మసీ కళాశాల, అందోల్‌లో రూ.35 కోట్లతో లా కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలో నర్సింగ్ కళాశాలను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. యువతకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి పోటీ ప్రపంచంలో ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.
10 నుంచి 15 పరిశ్రమల ఏర్పాటుకు కృషి:యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అందోల్ నియోజకవర్గంలో 10 నుంచి 15 పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సింగూరు, అందోల్ ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మెట్ట ప్రాంతాలకు సైతం సాగునీరు అందించాలనే లక్ష్యంతో పెద్దారెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తూ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
జిల్లాలో నెలకు రూ.36.97 కోట్ల పింఛన్లు:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 1,48,562 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ.32.73 కోట్ల పింఛన్లు అందుతున్నాయని వివరించారు. తాజాగా మరో 18,591 మందికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు కాగా, వీరికి నెలకు రూ.4.24 కోట్ల పింఛన్ అందించనున్నట్లు తెలిపారు.అందోల్ నియోజకవర్గంలో కొత్తగా 3,130 మందికి పింఛన్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరుకాలేక మంజూరు పత్రాలు పొందని లబ్ధిదారులు సంబంధిత మండల కార్యాలయాల్లో వాటిని తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, ఆర్డీవో రమేష్ బాబు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జగదీష్, డీఆర్డీఏ ఏపీడీ సూర్యారావు, మున్సిపల్ కమిషనర్, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నూతన పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.