20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
మద్దిమడుగు, నవంబర్ 26, ప్రజా సంక్షేమం న్యూస్:
గిరిజనుల హక్కులు, అభ్యున్నతి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎస్టీల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని, ఆ కమిషన్ చైర్మన్గా లంబాడా సోదరుడిని నియమిస్తామని ప్రకటించారు. లంబాడా సమాజానికి రాజకీయంగా రావాల్సిన అవకాశాలు, కోటాను సాధించేందుకు ఢిల్లీకి వెళ్లి పోరాడతామని హామీ ఇచ్చారు.నాగర్కర్నూల్ జిల్లా మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, లంబాడా సమాజ చరిత్ర, సేవాలాల్ మహారాజ్ బోధనలు, గిరిజనుల సంక్షేమం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రసంగించారు.
లంబాడా జాతి పోరాట పటిమ గొప్పది:అనంతపురంలో జన్మించిన సంత్ సేవాలాల్ మహారాజ్ సమాజానికి సన్మార్గాన్ని చూపారని, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని బోధిస్తూ ఆదర్శమూర్తిగా నిలిచారని సీఎం కొనియాడారు. లంబాడా సమాజానికి ఆయన ఆరాధ్య దైవమని పేర్కొన్నారు.బ్రిటిష్ పాలకులను, నిజాం నవాబును ఎదుర్కొన్న పోరాట చరిత్ర లంబాడా జాతికి ఉందని, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న వారికి తండాల్లో ఆశ్రయం కల్పించిన గొప్ప మనసు ఆ సమాజానికి ఉందన్నారు. నమ్మిన వారి కోసం ప్రాణాలు సైతం ఇచ్చే విశ్వాసం, నిబద్ధత లంబాడా జాతి ప్రత్యేకత అని పేర్కొన్నారు.