PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 8:36 pm Posted by : Praja Sankshemam News

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట!

అర్హత, అవకాశం ఉన్న ప్రతి రంగంలో వారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 18 (ప్రజా సంక్షేమం న్యూస్):
షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత అవకాశాలు కల్పిస్తూ వారి అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి వివరించారు.దళితులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నాం: శాసనసభ స్పీకర్ పదవితో పాటు మంత్రులుగా దళితులకు అవకాశాలు కల్పించామని సీఎం తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, వివిధ కార్పొరేషన్లలోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించామన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేళ్ల చరిత్రలో తొలిసారిగా దళితుడికి వైస్‌ ఛాన్సలర్‌గా అవకాశం ఇచ్చామని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ ఐఐఐటీలలోనూ ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారికి వీసీలుగా అవకాశాలు కల్పించినట్లు వివరించారు.
ఇందిరమ్మ ఇళ్లలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్), ఆరోగ్యశ్రీ నిధుల్లో 50 శాతానికి పైగా ఈ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.ఎస్సీ వర్గీకరణ అమలులో తెలంగాణ ముందంజ: దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుపై పార్లమెంటరీ కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.ఈ సమావేశంలో పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తేతో పాటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, తాపీర్ గావ్, హరీశ్ చంద్ర మీనా, అనిల్ ఫిరోజియా, అరుణ్ కుమార్, దగ్గుమల్ల ప్రసాద రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.