PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 5:11 pm Posted by : Praja Sankshemam News

ఓటు చోరీపై ఢిల్లీలో ప్రజా గర్జన!

ఓటు బచావో – దేశ్ బచావో’ నినాదంతో హోరెత్తిన రామ్‌లీలా మైదానం..
ఎన్నికల సంఘం తీరుపై ‘ఇండియా’ కూటమి నిరసన.. సీఈసీ రాజీనామాకు డిమాండ్!
న్యూఢిల్లీ,నవంబర్1(ప్రజా సంక్షేమం న్యూస్):

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఓటర్ల జాబితాల నుంచి అర్హులైన పౌరుల పేర్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు.లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఇతర ప్రతిపక్ష నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మింటో రోడ్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు సాగిన ప్రదర్శనలో నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ఓటు హక్కు పరిరక్షణకు నినాదాలు చేశారు.ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు పలు ఆంక్షలు విధించినప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, పౌర సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. రామ్‌లీలా మైదానం పరిసరాలు నిరసనకారులతో సందడిగా మారాయి.
ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ.. SIR పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీయడమేనని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని ప్రకటించారు.‘ఓటు బచావో – దేశ్ బచావో’ నినాదంతో సాగిన ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితాల పారదర్శకత అంశాలను మరోసారి జాతీయ స్థాయి చర్చలోకి తీసుకొచ్చారు.