నేటి నుంచే గిగ్ వర్కర్స్ సంక్షేమ చట్టం అమలు
హైదరాబాద్, నవంబర్ 14 (ప్రజా సంక్షేమం న్యూస్):తెలంగాణ రాష్ట్రంలోని గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కలిసి గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమ విధానాన్ని ఆవిష్కరించడంతో పాటు ఆన్లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు.దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని జయభేరీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ చట్టాన్ని ప్రజలకు అంకితం చేశారు. తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ నిబంధనల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు

అంతకుముందు శిల్పారామం నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, పలువురు మంత్రులు గిగ్ వర్కర్లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు నెహ్రూ జయంతి రోజున గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ చట్టాన్ని ప్రజలకు అంకితం చేశామని, ఈ చట్టం నేటి నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ చట్టం ద్వారా ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల జీవిత బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి కార్మికుడికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందించనున్నట్లు వెల్లడించారు. కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ చట్టం రూపకల్పనలో ఐఐటీ వంటి సంస్థలు, సామాజిక కార్యకర్త నిఖిల్ డే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సహకరించారని సీఎం పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల నాయకులు, నిపుణులతో విస్తృతంగా చర్చించిన అనంతరం ఈ చట్టాన్ని రూపొందించినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు పాల్గొన్నారు.