PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 6:26 pm Posted by : Praja Sankshemam News

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: సీఎం రేవంత్ రెడ్డి

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం
85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా సంక్షేమం న్యూస్):

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో దేశ ప్రగతికి తెలంగాణ తనవంతు సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.హైదరాబాద్ హైటెక్స్‌లో గురువారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశ భద్రత, జాతీయ ప్రాధాన్యతలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమం వంటి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలను ఎన్నికలకే పరిమితం చేసి మిగిలిన సమయాన్ని దేశాభివృద్ధికి కేటాయించాలన్నారు.తెలంగాణలో రహదారుల అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి పలు ప్రతిపాదనలు అందించామని, వాటిపై త్వరితగతిన సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.రాష్ట్రాన్ని మూడు అభివృద్ధి జోన్లుగా విభజించి ప్రణాళికలు రూపొందించామని సీఎం వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో సేవా రంగానికి, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మధ్య తయారీ రంగానికి, ఆర్ఆర్ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ రంగాల అభివృద్ధికి పటిష్టమైన రవాణా వ్యవస్థ, రోడ్ నెట్‌వర్క్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. నగరాలు, గ్రామాలు, పారిశ్రామిక కారిడార్లను అనుసంధానించేలా రహదారులను అభివృద్ధి చేస్తే కనెక్టివిటీ, మొబిలిటీ పెరిగి వ్యాపార, వాణిజ్య రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పారు.మౌలిక సదుపాయాల కల్పనలో రహదారులతో పాటు వైద్య రంగానికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆధునిక సదుపాయాలతో నూతన ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని, టిమ్స్ ఆస్పత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగస్వాములు కావాలని దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఆహ్వానం పలికారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐఆర్సీ అధ్యక్షుడు లక్ష్మి కాంత పధి, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, ఐఆర్సీ ప్రతినిధులు, రహదారుల రంగ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.