PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 6:22 pm Posted by : Praja Sankshemam News

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క–సారలమ్మ తోరణాల నమూనాలతో సాంస్కృతిక వైభవం.. విదేశీ ప్రతినిధులకు మెరుగైన సౌకర్యాలు
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మిట్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు.సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సమ్మక్క–సారలమ్మ ఆలయ తోరణాల నమూనాలతో అలంకరణలు చేపట్టాలని, రాష్ట్ర సంప్రదాయాలు, ప్రత్యేకతలు ప్రపంచ ప్రతినిధులకు పరిచయం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.దేశ, విదేశాల నుంచి హాజరయ్యే ప్రతినిధులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత ప్రవేశ వ్యవస్థ, మెరుగైన ఇంటర్నెట్ సదుపాయాలు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతినిధులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక లైజనింగ్ అధికారుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపారు.ఎడ్యుకేషన్ పెవిలియన్‌లో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, విద్యారంగంలో తెలంగాణ సాధిస్తున్న పురోగతి, భవిష్యత్ అవకాశాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించాలని సీఎం సూచించారు.తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యం, అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.