PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 8:07 am Posted by : Praja Sankshemam News

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి:సీఎం రేవంత్ రెడ్డి

–ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
-తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్రను ఒప్పించాలి..
-పెండింగ్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలి..
-సాస్కీ కింద అదనంగా రూ.5 వేల కోట్లు మంజూరు చేయాలని అభ్యర్థన!
-ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానికి ఆహ్వానం!
న్యూఢిల్లీ:నవంబర్ 16,ప్రజా సంక్షేమం న్యూస్

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయడంతో పాటు, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి సహకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో మోదీతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులు, క్రీడా రంగ అభివృద్ధిపై చర్చించారు.ఈ సమావేశంలో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సహకరించాలి!
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును +152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో జరిగిన సమావేశం వివరాలను వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వెనుకబడిన, గిరిజన ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు, తాగునీరు అందించవచ్చని వివరించారు.
పెండింగ్ అనుమతులు త్వరగా మంజూరు చేయాలి:పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసినప్పటికీ పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం వివరించారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన సానుకూల తీర్పు నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
సాస్కీ కింద రూ.5 వేల కోట్లు ఇవ్వాలి:సాస్కీ పథకం కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రధానిని అభ్యర్థించారు. 70 నుంచి 90 శాతం వరకు పూర్తయిన ప్రాజెక్టులను ఈ నిధులతో పూర్తి చేయవచ్చని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిధులు విడుదల చేస్తే కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, తద్వారా రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతాయని వివరించారు.
సమ్మక్క సాగర్‌కు ఛత్తీస్‌గఢ్ ఎన్ఓసీ ఇప్పించాలి:సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి సమర్పించినట్లు సీఎం తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములు, గ్రామాలను గుర్తించేందుకు ఎఫ్‌ఆర్‌ఎల్, బ్యాక్‌వాటర్ స్థాయిలతో సమగ్ర సర్వే నిర్వహణకు రూ.9.88 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని, ఆ రాష్ట్రం నుంచి త్వరగా నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) వచ్చేలా చూడాలని కోరారు.
పీఎంకేఎస్‌వై కింద నిధుల కోసం విజ్ఞప్తి:ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద పలు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని సీఎం కోరారు. సమ్మక్క సాగర్-సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు, చనాకా-కొరాటా బ్యారేజీకి రూ.103 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ప్రధానికి ఆహ్వానం:హైదరాబాద్‌లో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేసి, గేమ్స్ లోగో, మస్కట్‌ల వివరాలను తెలియజేశారు.ఈ క్రీడలు యువ క్రీడాకారులకు ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలకు వేదికగా నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు. 2002లో జాతీయ క్రీడలు, 2007లో ప్రపంచ మిలిటరీ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం తెలంగాణకు ఉందని వివరించారు.