14, 15, 16వ వార్డుల్లో రూ.3.20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
తెల్దారుపల్లి: ప్రజా సంక్షేమం న్యూస్:
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామ ప్రజలు, రైతుల సౌకర్యార్థం ఎన్నెస్పీ కాలువపై రూ.5 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గ్రామానికి అవతలివైపు ఉన్న వ్యవసాయ భూములకు రైతులు సులభంగా వెళ్లేందుకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.మంగళవారం తెల్దారుపల్లిలోని 14, 15, 16వ వార్డుల్లో రూ.3.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఏదులాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్‌తో కలిసి మాట్లాడారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 33 నెలల్లో తెల్దారుపల్లి అభివృద్ధికి రూ.16.06 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. రూ.5.25 కోట్లతో 105 ఇందిరమ్మ ఇళ్లను పేదలకు మంజూరు చేసినట్లు తెలిపారు.
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత:గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తోందని వివరించారు. సన్నరకం ధాన్యం పండించే రైతులకు బోనస్ అందిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.40 వేల కోట్లు:రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో అర్హులైన పేదలకు లక్ష ఇళ్లు కేటాయిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం మొత్తం రూ.40 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
అర్హులైన రైతులందరికీ భూధార్ కార్డులు:రాష్ట్రంలో సుమారు 125 సంవత్సరాల క్రితం భూముల సర్వే జరిగిందని, రైతులకు భూములపై పూర్తి హక్కులు, భరోసా కల్పించేందుకు తమ ప్రభుత్వం మరోసారి భూ సర్వే చేపడుతోందని మంత్రి తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో భూ సర్వేను వెంటనే ప్రారంభించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అర్హులైన రైతులందరికీ భూధార్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు, ఆర్డీవో శ్రీనివాస్, ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిషోర్ నాయక్, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.