PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 6:12 pm Posted by : Praja Sankshemam News

దళిత పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి!

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్
నల్లగొండ, నవంబర్ 19 (ప్రజా సంక్షేమం న్యూస్):

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న దళిత మహిళ చందుపట్ల రమణ (45)పై దాడికి పాల్పడిన బాలకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) నల్లగొండ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.చెత్త సేకరణ విధుల్లో భాగంగా ట్రాక్టర్‌పై నిలబడి చెత్తను అందుకునే సమయంలో ఇసుకతో నిండిన బస్తాను పైకి ఎత్తలేకపోయినందుకు ఆగ్రహించిన బాలకృష్ణ, రమణను కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషిస్తూ సెంట్రింగ్ కర్రతో కాళ్లపై విచక్షణారహితంగా దాడి చేశాడని నాగార్జున తెలిపారు. స్థానికులు అడ్డుకున్నప్పటికీ తిరిగి దాడికి ప్రయత్నించడం దారుణమన్నారు.రెక్కాడితే గానీ డొక్కాడని పేద దళిత మహిళపై ఇలాంటి దాడికి పాల్పడటం అమానవీయమని, పారిశుద్ధ్య కార్మికుల పట్ల చిన్నచూపు, అహంకార ధోరణికి ఈ ఘటన నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలిని నిందితుడి తల్లి కూడా దుర్భాషలాడినట్లు ఆమె తెలిపిందన్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడితో పాటు దూషణలకు పాల్పడిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం, తగిన భద్రత కల్పించాలని, పారిశుద్ధ్య కార్మికులపై భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.కాగా, నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో బాధితురాలు చందుపట్ల రమణను కేవీపీఎస్ నాయకులు పరామర్శించి సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, కేవీపీఎస్ పట్టణ కార్యదర్శి గాదె నరసింహ, దళిత నాయకులు కొత్తపల్లి నరసింహ, చందుపట్ల రమణ, సుంకిశాల అమృత, పెరిక కృష్ణ, ఎర్ర శీను, డ్రైవర్ నవీన్, సంతోష్ కుమార్, దేవరకొండ నరసింహ, రమేష్, లింగయ్య, సందీప్ తదితరులు పాల్గొన్నారు.