PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 6:47 pm Posted by : Praja Sankshemam News

నల్లగొండలో భారీ చోరీల ముఠా గుట్టురట్టు ## ఎయిర్‌టెల్ టవర్లలో రేడియో రిమోట్ యూనిట్లే టార్గెట్.. తొమ్మిది మంది అరెస్ట్!

నవంబర్ 14, ప్రజా సంక్షేమం న్యూస్ – నల్లగొండ:పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఇంజినీర్ల ముఠా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఎయిర్‌టెల్ మొబైల్ టవర్లలో అమర్చిన ఖరీదైన రేడియో రిమోట్ యూనిట్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో అదే సంస్థలో పనిచేస్తున్న ముగ్గురు ఇంజినీర్లు ఉండటం గమనార్హం.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 38 చోరీలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ చోరీల ద్వారా సుమారు రూ.1.62 కోట్ల విలువైన రేడియో రిమోట్ యూనిట్లను అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన యూనిట్లను హైదరాబాద్‌లో విక్రయించి వచ్చిన డబ్బుతో విలాసవంతమైన కార్లు, బైకులు కొనుగోలు చేస్తూ జల్సాలు చేసినట్లు తెలిసింది.జిల్లాల వారీగా నల్లగొండలో 9, మిర్యాలగూడలో 16, దేవరకొండలో 2, సూర్యాపేటలో 8, ఇతర జిల్లాల్లో 3 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.నిందితుల నుంచి సుమారు రూ.25 లక్షల విలువైన మూడు కార్లు, రెండు బైకులు, రూ.15 లక్షల నగదు, 8 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నల్లగొండ సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఈ ముఠా కార్యకలాపాలను వెలుగులోకి తీసుకొచ్చారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్‌లో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.