ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు
కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, నవంబర్ 14 (ప్రజా సంక్షేమం న్యూస్): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ నవంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.ఈ పథకం ద్వారా దేశంలోనే తొలిసారిగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఆయన పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పథకం అమలుకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు.కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుందని భట్టి విక్రమార్క తెలిపారు. కుటుంబంలో ఒక్కరే ఉపాధి పొందుతున్నట్లయితే వారికి బీమా వర్తిస్తుందని, పలువురు ఉపాధి పొందుతున్న కుటుంబాల్లో ఎవరికి బీమా కల్పించాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చని వివరించారు.
అదేవిధంగా ఒకరు లేదా పలువురిని నామినీలుగా ఎంపిక చేసుకోవచ్చని, బీమా మొత్తాన్ని నామినీలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలన్నది కూడా కుటుంబ సభ్యులే నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.నవంబర్ 19 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో ఏకకాలంలో లబ్ధిదారుల నమోదు ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నమోదు కేంద్రాల వివరాలను ముందుగానే ప్రజలకు తెలియజేయాలని, నమోదు చేసిన వివరాలను కుటుంబ సభ్యులకు చదివి వినిపించి వారి అంగీకారాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు.నవంబర్ 17, 18 తేదీల్లో గ్రామాల్లో దండోరా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు పథకంపై అవగాహన కల్పించాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది.