PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 6:01 am Posted by : Praja Sankshemam News

పట్టణాభివృద్ధికి రూ.20 వేల కోట్ల భారీ ప్రణాళిక.. వరంగల్‌కు కీలక ప్రాధాన్యం

వాతావరణ మార్పులను తట్టుకునేలా,పర్యావరణహిత నగరాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాలను ఆధునీకరించి, వాతావరణ మార్పులను తట్టుకునేలా నగరాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పురపాలక శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణ, వరద ముప్పు నివారణ, పట్టణ నిర్వహణ వ్యయాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించారు.ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (AIIB), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ (KfW)తో పాటు దేశీయ ఆర్థిక సంస్థల సహకారంతో దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.ఈ ప్రతిపాదనల్లో వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు, వరంగల్ కోట చుట్టూ ఉన్న కందకం పునరుద్ధరణ, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.
పట్టణాల్లో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సమావేశంలో చర్చించారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ముఖ్యంగా టెక్స్‌టైల్ పార్కులకు సరఫరా చేయడం ద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడిని తగ్గించవచ్చని భావిస్తున్నారు. పట్టణ తాగునీటి సరఫరా, శుద్ధి, పంపిణీ వ్యవస్థల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని సీఎం అధికారులకు సూచించారు.వరంగల్ మెగా సిటీ ఎకనామిక్ రీజియన్ పరిధిలో చెత్త నుంచి 10 నుంచి 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుతో పాటు బయో సీఎన్‌జీ ఉత్పత్తి కేంద్రాలు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుపై కూడా సమీక్షించారు.ఈ ప్రాజెక్టుల అమలుతో పట్టణాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం, నీటి వనరులను కాపాడటం, వరద ముప్పును నియంత్రించడం, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడం, పురపాలక సంస్థల నిర్వహణ ఖర్చులను తగ్గించడం వంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది.