నకిరేకల్ నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా నూతన పింఛన్ల పంపిణీ!
నార్కట్పల్లి మండల MPDO కార్యాలయంలో నిర్వహించిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం..
నార్కట్పల్లి, నవంబర్ 16 (ప్రజా సంక్షేమం న్యూస్):
నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్పల్లి మండల MPDO కార్యాలయంలో నిర్వహించిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్కట్పల్లి, గొపలాయిపల్లి, యెడవెల్లి, పోతినేనిపల్లి, ఏపీ లింగోటం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా నూతన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వికలాంగులు, చేనేత కార్మికులు, వితంతువులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు ఈ విడతలో పింఛన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.గత ప్రభుత్వం రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తోందని వివరించారు.నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద్ మోహన్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.