PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 4:54 pm Posted by : Praja Sankshemam News

పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. కొత్త పాలసీలు తీసుకొస్తాం

గ్రామ పంచాయతీల్లో పౌల్ట్రీ పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు.. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 25 (ప్రజా సంక్షేమం న్యూస్):
పౌల్ట్రీ పరిశ్రమను రాష్ట్రంలో ప్రాధాన్యత రంగంగా గుర్తించి, దాని అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కొత్త పాలసీలు రూపొందిస్తామని, కాలానుగుణంగా క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా వాటిని మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో నిర్వహించిన పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. పౌల్ట్రీ పరిశ్రమ కేవలం కోళ్లు, గుడ్ల ఉత్పత్తికే పరిమితం కాదని, రైతుల ఆర్థిక శక్తిని బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయ కూలీలు, రైతులకు ఉపాధి కల్పించే కీలక రంగమని పేర్కొన్నారు. సుమారు 5.30 కోట్ల గుడ్ల ఉత్పత్తితో విద్యార్థులు, యువతకు పౌష్టికాహారం అందించడంలో పౌల్ట్రీ వ్యాపారులు భాగస్వాములవుతున్నారని అభినందించారు.పౌల్ట్రీ పరిశ్రమల ఏర్పాటుకు ఎదురవుతున్న సమస్యలు, సంక్షోభ సమయంలో ప్రభుత్వం అండగా ఉండాలన్న వ్యాపారుల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సీఎం తెలిపారు. గ్రామ పంచాయతీల పరిధిలో పౌల్ట్రీ పరిశ్రమల నిర్మాణానికి సింగిల్ విండో విధానంలో అనుమతులు అందించేలా మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ప్రభుత్వ వద్ద ఉన్నాయని తెలిపారు. అయితే పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైన మొక్కజొన్న కొరత సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రులను ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు.ఒడిదుడుకులను తట్టుకుని పరిశ్రమను కొనసాగిస్తూ, అభివృద్ధికి కృషి చేస్తున్న పౌల్ట్రీ వ్యాపారుల ప్రయత్నాలను ప్రభుత్వం అభినందిస్తోందని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల విషయంలో పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదని, గత ప్రభుత్వాలు రూపొందించిన మంచి విధానాలను కొనసాగిస్తూనే కొత్త పాలసీలను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.