PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 3:55 pm Posted by : Praja Sankshemam News

ప్రకృతి విలయం సృష్టించినా.. మానవత్వం అంతకంటే బలంగా నిలవాలి!

ఆపదలో ప్రాణాలకు తెగించి సేవలందించిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి అభినందనలు
సొంత ఇల్లు లేని రెస్క్యూ సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం
ప్రజాసంక్షేమం న్యూస్ ఖమ్మం
:ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మురసు తుపాను ప్రభావంతో చోటుచేసుకున్న సంఘటనలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, బాధితులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్దచెరువులో వరద ఉద్ధృతిలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఖమ్మం పోలీస్ కమిషనర్‌తో పాటు రెవెన్యూ, పోలీస్, రెస్క్యూ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.అర్ధరాత్రి దాటే వరకు ఫోన్ ద్వారా సహాయక చర్యలను పర్యవేక్షించానని, ఉదయాన్నే హైదరాబాద్ నుంచి బేతుపల్లి పెద్దచెరువు వద్దకు చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించినట్లు వెల్లడించారు.వరదల్లో చిక్కుకున్న మత్స్యకారులతో పాటు ప్రమాదంలో చిక్కుకున్న రెస్క్యూ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురావడంలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చూపిన ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి అభినందనీయమన్నారు. కలెక్టర్లు, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టిన సహాయక చర్యలను ప్రశంసించారు.అనంతరం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ సిబ్బందిలో సొంత ఇల్లు లేని వారు ఎవరైనా ఉంటే, వారు తెలంగాణలో ఏ జిల్లాకు చెందిన వారైనా సరే వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఆపత్కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షించారు.