PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 8:22 pm Posted by : Praja Sankshemam News

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి – ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

డిసెంబర్ నాటికి మరో 14 ఆసుపత్రుల భవన నిర్మాణాలు పూర్తి 2027 మార్చి నాటికి మరో 11 ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేయాలి ఇప్పటికే పూర్తయిన 9 ఆసుపత్రుల్లో పరికరాలు, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలి ఎల్‌నినో నేపథ్యంలో ఆసుపత్రుల్లో నీరు, విద్యుత్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు
హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్:

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆసుపత్రుల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.సెకండరీ హెల్త్‌కేర్ డైరెక్టరేట్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల భవన నిర్మాణ పనుల పురోగతిపై సోమవారం జూబ్లీహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్. చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, వివిధ జిల్లాల డీసీహెచ్‌ఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆసుపత్రులు, మెడికల్, నర్సింగ్ కళాశాలల భవన నిర్మాణ పనుల పురోగతిని మంత్రికి వివరించారు. సెకండరీ హెల్త్‌కేర్ డైరెక్టరేట్ పరిధిలో ఇప్పటివరకు 9 ఆసుపత్రుల భవన నిర్మాణాలు పూర్తయ్యాయని, డిసెంబర్ నాటికి మరో 14 భవనాలు, 2027 మార్చి నాటికి మరో 11 భవనాల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. మరో 45 భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.నిర్మాణాలు పూర్తయిన 9 ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నిచర్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. డిసెంబర్, మార్చి నాటికి పూర్తికానున్న ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలు ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
జిల్లాల్లోనే 90 శాతం మందికి వైద్యం అందించాలిజిల్లాల్లోని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనితీరుపై మంత్రి సమీక్షిస్తూ.. కనీసం 90 శాతం మంది రోగులకు జిల్లాల్లోనే మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో ఈ ఆసుపత్రుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
గత మూడేళ్లలో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు సహా ఆరోగ్యశాఖలో సుమారు 15 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. డీఎస్‌హెచ్ పరిధిలోని ఆసుపత్రుల్లో ఇటీవలే 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. అవసరమైన వైద్య పరికరాలు సమకూరుస్తూ, నూతన ఆసుపత్రి భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే బాధ్యత డీసీహెచ్‌ఎస్‌లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లపై ఉందని స్పష్టం చేశారు.
ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి:ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఆసుపత్రుల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఆసుపత్రుల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.