PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 6:29 pm Posted by : Praja Sankshemam News

మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఓల్డ్ సిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత.. హజ్‌హౌస్‌ పక్కన అసంపూర్తి భవన నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయింపు
మైనార్టీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్, సంక్షేమ శాఖ కార్యాలయాల ఏర్పాటు
హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్:

రాష్ట్రంలోని మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమంతో పాటు వారికి మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం ప్రజాభవన్‌లో మైనార్టీ సంక్షేమ శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో మైనార్టీల విద్యాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, విద్యాసంస్థల నిర్మాణాలు, స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, ఓల్డ్ సిటీ అభివృద్ధి తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం, ఆంక్షలు ఉండబోవని భరోసా ఇచ్చారు. నాంపల్లిలోని హజ్‌హౌస్‌ పక్కన కొన్నేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.వివిధ రహదారుల విస్తరణ పనుల కోసం వినియోగించిన వక్ఫ్‌ భూములకు సంబంధించి జీహెచ్‌ఎంసీ నుంచి వక్ఫ్‌ బోర్డుకు రావాల్సిన నిధుల్లో రూ.25 కోట్లను ఈ భవన నిర్మాణానికి కేటాయించాలని సూచించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.ఈ భవనంలో మైనార్టీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్‌తో పాటు మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన వివిధ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణతో పాటు మైనార్టీ సంక్షేమ సేవలను మరింత చేరువ చేయవచ్చని పేర్కొన్నారు.ఈ సమావేశంలో శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, కార్యదర్శి బి. షఫీఉల్లా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.