నవంబర్ 15న చలో నల్లగొండ…
రైతులారా కదలండి.. లక్షలాదిగా తరలిరండి…
మోదీ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి: ఎం.డి.జహంగీర్
ప్రజా సంక్షేమం న్యూస్ | ఆత్మకూరు
ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి. జహంగీర్ పిలుపునిచ్చారు. నవంబర్ 15న నల్లగొండలోని ఎన్‌జీ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ, ప్రదర్శనకు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని కోరారు.బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై జాతీయ రైతు మహాసభల ప్రచార గోడపత్రికను రైతు సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులను సంఘటితం చేస్తూ, రైతాంగ హక్కుల సాధన కోసం ఏఐకేఎస్ నిరంతరం పోరాటం సాగిస్తోందని తెలిపారు. సామ్రాజ్యవాదం, భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మక పోరాటాల వారసత్వాన్ని కొనసాగిస్తూ రైతుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తోందన్నారు.కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా అమలవుతున్న ఆర్థిక విధానాలు, అసమాన మార్కెట్ వ్యవస్థ, బలహీనమైన సామాజిక భద్రత, ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ రైతులు పండించిన పంటలకు తగిన ధర లభించక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు సమగ్ర విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ జాతీయ మహాసభలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 950 మందికి పైగా ప్రతినిధులు, పరిశీలకులు, నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన పోరాట కార్యాచరణపై మహాసభల్లో సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.నవంబర్ 15న నల్లగొండ ఎన్‌జీ కళాశాల ఆవరణలో జరిగే బహిరంగ సభ, ప్రదర్శనను విజయవంతం చేసేందుకు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జహంగీర్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు, మండల కార్యదర్శి వేముల బిక్షం, రైతు సంఘం మండల గౌరవ అధ్యక్షులు వి. గోపాల్ రెడ్డి, మండల కార్యదర్శి తుమ్మల సత్యనారాయణరెడ్డి, మండల కమిటీ సభ్యులు మల్లెల శ్రీశైలం, కందాల వెంకటరెడ్డి, నాయిని యాదిరెడ్డి, ఏపూరి బుగ్గ రాము తదితరులు పాల్గొన్నారు.