PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 8:40 pm Posted by : Praja Sankshemam News

రైతుల పంట రుణాల రీషెడ్యూల్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరవు పరిస్థితులు..
రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు.. రబీ సీజన్‌కు కొత్త రుణాలు సకాలంలో అందించాలి…
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరవు కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బ్యాంకర్లను ఆదేశించారు. కష్టకాలంలో రైతులకు అండగా నిలవడం బ్యాంకుల బాధ్యతని, రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రత్యేక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో 365 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించగా, వాటిలో 111 మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు బ్యాంకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.రానున్న రబీ సీజన్‌కు కొత్త పంట రుణాలను సకాలంలో మంజూరు చేయాలని, తక్కువ నీటితో సాగు చేయగల పంటలకు రుణ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పంటల మార్పిడిని ప్రోత్సహించడంతో పాటు సూక్ష్మ సేద్యం చేపట్టే రైతులకు ఆర్థిక చేయూత అందించాలని సూచించారు.
రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు:కరవు పరిస్థితులను అధిగమించేందుకు వ్యవసాయంతో పాటు రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను కల్పించాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 నుంచి 15 శాతం రైతు కుటుంబాలకు అదనపు ఉపాధి అవకాశాలు కల్పించేలా బ్యాంకులు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు అదనంగా రూ.2 లక్షల వరకు రుణాలు అందించే అంశాన్ని పరిశీలించాలని, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు.
విద్యా,గృహ రుణాల మంజూరుకు ప్రాధాన్యత:విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించే విద్యా రుణాలు, సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసే గృహ రుణాల మంజూరులో బ్యాంకులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని డిప్యూటీ సీఎం సూచించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), మౌలిక సదుపాయాల రంగాలకు రుణాల పంపిణీని పెంచాలని నిర్దేశించారు. రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు ఈ నెల 19వ తేదీ నాటికి బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలని కోరారు.రైతులు ప్రస్తుత కరవు పరిస్థితుల నుంచి త్వరగా కోలుకుని రబీ సీజన్‌ను పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రారంభించేలా బ్యాంకులు, వ్యవసాయశాఖ, సహకారశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Copyright © 2026 PRAJA SANKSHEMAM NEWS. All rights reserved.