PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 12:09 am Posted by : Praja Sankshemam News

రైతుల హక్కుల కోసం ఎర్రజెండా పోరాట వారసత్వాన్ని కాపాడుకోవాలి

కార్పొరేట్ అనుకూల విధానాలతో వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం
మహిళా రైతులకు గుర్తింపు, భూసంస్కరణలు అమలు చేయాలి: బృందా కారత్
నల్లగొండ, నవంబర్ 15, ప్రజా సంక్షేమం న్యూస్:

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను మతతత్వ రాజకీయాలకు ఆపాదించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని మాజీ ఎంపీ, ఐద్వా జాతీయ నాయకురాలు బృందా కారత్ పిలుపునిచ్చారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల హక్కుల పరిరక్షణ కోసం ఎర్రజెండా నాయకత్వంలో సాగిన పోరాట వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఆదివారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.కిసాన్ సభ తొమ్మిది దశాబ్దాలుగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటమని పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం తదితర పోరాట యోధుల సేవలను స్మరించుకుంటూ నాలుగు వేల మంది అమరవీరులకు లాల్‌సలాం ప్రకటించారు.
కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర విధానాలు:కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవసాయ విధానాలను రూపొందిస్తోందని బృందా కారత్ విమర్శించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించిన ఉద్యమం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని గుర్తుచేశారు. భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల రైతులకు నష్టం కలిగే ప్రమాదం ఉందని పేర్కొంటూ, రైతులతో చర్చించకుండా ఇటువంటి ఒప్పందాలు చేయవద్దని డిమాండ్ చేశారు.
రైతు ఆత్మహత్యలను అరికట్టాలి:రైతుల పంట నష్టాలకు పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని, పంటల బీమా సంస్థలపై నియంత్రణ ఉండాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర కల్పించాలని, డీజిల్ ధరలను నియంత్రించాలని, విద్యుత్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని అన్నారు. రైతులపై స్మార్ట్ మీటర్ల భారం మోపవద్దని సూచించారు. గ్రామీణ పేదలకు జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని కోరారు.
భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేయాలి:దేశంలో భూమి పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నాయని, భూగరిష్ట పరిమితి చట్టాలను పకడ్బందీగా అమలు చేసి భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల కారణంగా చిన్న, సన్నకారు రైతులు భూములను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా రైతులకు సముచిత గుర్తింపు ఇవ్వాలి:వ్యవసాయ రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి రైతులుగా గుర్తింపు లభించడం లేదని అన్నారు. మహిళా రైతులకు భూమిపై హక్కులు కల్పించడంతోపాటు ప్రభుత్వ రికార్డులు, సంక్షేమ పథకాలలో రైతులుగానే గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీల హక్కులను పరిరక్షించాలి:అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో రైతులను నిర్వాసితులను చేయడం సరికాదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని అన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పోడు రైతులకు హక్కులు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామసభల అధికారాలను గౌరవించాలని, ఆదివాసీలను అటవీ ప్రాంతాల నుంచి తొలగించే చర్యలు చేపట్టవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తూ 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.