అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు – కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆదేశాలు
హనుమకొండ, ప్రజా సంక్షేమం న్యూస్: ప్రభుత్వ పునరావాస పథకం ద్వారా లొంగిపోయిన మాజీ నక్సల్స్‌కు అందించాల్సిన ప్రయోజనాలను సమర్థవంతంగా అమలు చేసి, వారికి మెరుగైన జీవనోపాధి కల్పించే లక్ష్యంతో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆధ్వర్యంలో గురువారం వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా పరిధిలో పునరావాసానికి అర్హులైన 11 మంది లొంగిపోయిన మాజీ నక్సల్స్‌కు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంపై ప్రధానంగా చర్చించారు. అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అనువైన ప్రభుత్వ భూములను గుర్తించాలని, ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ భూములను పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత క్షేత్రస్థాయి అధికారులను కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆదేశించారు.అలాగే, లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పునరావాస ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, డీఆర్డీవో మేన శ్రీను, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్, ఆర్ అండ్ బీ ఈఈ దేవిక చౌహాన్, ఏసీపీ జానీ నరసింహులు, పలువురు తహసీల్దార్లు, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.