ఈ నెల 15 నాటికి ఓపీ సేవలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో మిగిలి ఉన్న పెండింగ్ పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.సచివాలయంలో మంగళవారం టిమ్స్ అల్వాల్, టిమ్స్ ఎల్బీ నగర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఆస్పత్రి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి అంతస్తు నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు.తొలుత ప్రారంభించనున్న ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కౌంటర్లు, వైద్యుల కన్సల్టేషన్ గదులు, ఫార్మసీ, డయాగ్నస్టిక్స్ తదితర విభాగాలకు అవసరమైన పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదే తేదీ నాటికి ఓపీ సేవలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, ఆరు ఆపరేషన్ థియేటర్లను కూడా సిద్ధం చేస్తామని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు.ఆస్పత్రికి వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉండాలని, ఒకసారి రోగి ఆస్పత్రిలో చేరిన తర్వాత మరో ఆస్పత్రికి రిఫర్ చేయాల్సిన పరిస్థితి రాకూడదని మంత్రి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.ప్రభుత్వం నియమించిన వైద్యుల బృందం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు అల్వాల్, కొత్తపేట టిమ్స్ ఆస్పత్రులను క్రమం తప్పకుండా సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు.అల్వాల్ టిమ్స్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, వైద్య పరికరాల ఏర్పాటు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఎల్బీ నగర్ టిమ్స్ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి చివరి దశకు చేరుకుంటాయని వివరించారు. అన్ని పనులను వేగవంతం చేసి ఆస్పత్రులను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.