PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 9:56 pm Posted by : Praja Sankshemam News

సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి

ప్రజలతో నిరంతరం అనుసంధానమై పనిచేయాలి.. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ పునాదులని పేర్కొన్నారు.అంకితభావంతో పనిచేసే సాధారణ కార్యకర్తకు పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని, క్షేత్రస్థాయి కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి నాయకులుగా తీర్చిదిద్దడం కాంగ్రెస్ సంప్రదాయమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, కొత్త రేషన్ కార్డుల జారీ, అర్హులకు సన్నబియ్యం పంపిణీ ఇందుకు నిదర్శనమని తెలిపారు.తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి, ఇతర పంటల ఉత్పత్తి నమోదవుతోందని పేర్కొన్న ఉత్తమ్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే నేటికీ రైతులకు నీటి భరోసా కల్పిస్తున్నాయని అన్నారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టులు వ్యవసాయానికి కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
భారీ మొత్తంలో ఖర్చు చేసినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ఆశించిన ప్రయోజనాలను అందించడం లేదని, దానిని పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగపడేలా చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కాళేశ్వరం పునరుద్ధరణకు మరింత వ్యయం అవసరమయ్యే పరిస్థితి ఉందని తెలిపారు.ఎల్‌నినో ప్రభావం, నీటి లభ్యతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, బోర్లు, చెరువులపై ఆధారపడే ప్రాంతాల్లో సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని అన్నారు. వచ్చే వర్షాకాలం వరకు తాగునీటి కొరత రాకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని, కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. నీటి కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.ప్రభుత్వ పథకాలు, విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నిరంతరం ప్రజలతో అనుసంధానమై ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.