ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
ప్రాజెక్టు పూర్తయింది.. నీటి నిల్వకు అనుమతులు ఇవ్వాలి ఎన్ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ
ప్రజాసంక్షేమం న్యూస్ రాయ్‌పూర్: ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన బహుళ ప్రయోజనాల సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు వెంటనే నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కోరారు. ఈ విషయంలో ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందిస్తూ ఎన్ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం, దాని ప్రయోజనాలు, మిగిలిన అనుమతులపై వివరించారు.ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలో భవిష్యత్తులో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని సీఎం వివరించారు. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు సమ్మక్క సాగర్‌లో గోదావరి జలాలను నిల్వ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ముంపు తగ్గించేందుకు తుపాకులగూడెంకు మార్పు:తొలుత కాంతనపల్లి వద్ద ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా, 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో 17 ఆదివాసీ గ్రామాలు ముంపునకు గురికావడంతో పాటు భద్రత, మౌలిక సదుపాయాలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు.ప్రాజెక్టు అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రూ.9.883 కోట్లను చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ జూలై 30న తన అధ్యయన నివేదికను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణం వల్ల ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురవుతాయని, భారీ వరదల సమయంలోనూ ఈ విస్తీర్ణం 100 ఎకరాలకు మించదని వెల్లడైంది.
6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం:ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. పూర్తి స్థాయి నీటిమట్టం +83 మీటర్ల వద్ద 6.94 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను వినియోగించి వెనుకబడిన, కరువు ప్రభావిత, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఎన్ఓసీ జారీ చేయడంతో పాటు మిగిలిన అనుమతులను కూడా త్వరితగతిన మంజూరు చేయాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని కోరారు.