ప్రజా సంక్షేమం న్యూస్
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు మానుకోకపోతే మోడీ ప్రభుత్వాన్ని ప్రజలే గద్దె దింపుతారని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ, కెవి పిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శీను లు హెచ్చరించారు.సోమవారం సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల, జాతీయ కమిటీ ల పిలుపుమేరకు జైల్ బరో కార్యక్రమంలో భాగంగా నిడమనూర్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్న నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ అనేక వాగ్దానాలు చేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని నరేంద్ర మోడీ సర్కార్ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని పోరాడుతుంటే అవి పట్టించుకోకుండా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పి దేశ ప్రజల ఆహార భద్రతకు ముప్పు తెచ్చే విత్తన చట్టాన్ని తేవడం,విద్యుత్ సవరణ చట్టం పేరుతో ప్రజలపై భారాల మోపే చర్యలు మానుకోకపోతే భారత రైతాంగం మోడీకి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. వందేళ్ళ క్రితం కార్మిక వర్గం తమ రక్తాన్ని చిందించి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్స్ తెచ్చిందని విమర్శించారు.ఉపాధి హామీ చట్టం ద్వారా ఈ దేశంలో 30 కోట్ల మంది వ్యవసాయ కార్మికులకు అంతో ఇంతో ఆసరాగా ఉన్న చట్టాన్ని రద్దుచేసి వ్యవసాయ కార్మికుల ఆకలి తో చంపే విబిజి రాంజీ చట్టం తేవడం ఏం న్యాయమని ప్రశ్నించారు. 79 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ విదేశీ కార్పొరేట్ వ్యక్తులకు కారు చౌకగా అమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం లౌకిక విలువలకు గోరి కట్టే విధంగా బిజెపి పాలన ఉందని విమర్శించారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు నిరుద్యోగం కార్మికుల నిజ వేతనాలు పడిపోతూ ప్రజల అల్లాడుతుంటే మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చులు పెడుతూ ప్రజల భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తుందని వీటిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధమవుతుందని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కందుకూరి కోటేష్, సిఐటియు మండల కన్వీనర్ కోమండ్ల గురువయ్య, రైతు సంఘం మండల అధ్యక్షులు నడ్డి నాగరాజు, ప్రజాసంఘాల నాయకులు ఆకారపు నరేష్, మళ్లీ కంటి చంద్రశేఖర్, వింజమూరి శివ, కుంచెం శేఖర్,వెంపటి మహేష్,, ముత్యాల కేశవులు, గుత్తా శ్రీనివాస్ రెడ్డి,బొడ్డు లింగయ్య, శ్యామల రాజేష్, చిత్రం శ్రీను, కందుల పరమేష్, వెంకటమ్మ, సైదమ్మ, మేరమ్మ, సాంబయ్య, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

