Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణగోల్ఫ్ టూరిజానికి ప్రపంచస్థాయి మౌలిక వసతులు: జూపల్లి

గోల్ఫ్ టూరిజానికి ప్రపంచస్థాయి మౌలిక వసతులు: జూపల్లి

📰 Generate e-Paper Clip

షామీర్‌పేట్ సమీపంలోని జవహర్‌నగర్‌లో 130 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్..
కృష్ణా నది తీరంలో సోమశిలలో మరో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్స్ ప్రతిపాదన!

ప్రజాసంక్షేమం న్యూస్
హైదరాబాద్: గోల్ఫ్ టూరిజాన్ని ప్రోత్సహించడంతో పాటు తెలంగాణను అంతర్జాతీయ గోల్ఫ్ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక,సాంస్కృతిక,పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.షామీర్‌పేట్ సమీపంలోని జవహర్‌నగర్‌లో 130 ఎకరాల విస్తీర్ణంలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. అదేవిధంగా కృష్ణా నది తీరంలోని సోమశిలలో మరో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ గోల్ఫ్ కోర్సులను అభివృద్ధి చేసి దేశ, విదేశాల నుంచి ప్రొఫెషనల్, ఔత్సాహిక గోల్ఫ్ క్రీడాకారులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు.
ప్రకృతి అందాల మధ్య సోమశిల గోల్ఫ్ కోర్స్!
కృష్ణా నది సుందర తీర ప్రాంతంలో, నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సమీపంలో సోమశిల గోల్ఫ్ కోర్స్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్లు మంత్రితెలిపారు.క్రీడలు,ప్రకృతి,పర్యాటకాన్ని సమన్వయం చేసే ప్రత్యేక గోల్ఫ్ టూరిజం కేంద్రంగా సోమశిలను తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు.ఈ ప్రాజెక్టును పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(PPP)విధానంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.హైదరాబాద్‌లోని గోల్కొండ గోల్ఫ్ క్లబ్‌లో జరుగుతున్న 12వ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.
గోల్ఫ్‌తో వారసత్వ సంపదకు అనుసంధానం!
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ కేవలం క్రీడా పోటీ మాత్రమే కాదని, తెలంగాణ చారిత్రక వారసత్వం, పర్యాటక అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా కూడా ఉపయోగపడుతుందని జూపల్లి అన్నారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో సరస్సులు, అడవులు, నదులు, రాజభవనాలు, కోటలు వంటి అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయని తెలిపారు. గోల్కొండ కోట నేపథ్యంగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ తెలంగాణ గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు.
హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ క్రీడలు, వారసత్వ సంపదను మేళవించే ప్రత్యేక వేదికగా నిలుస్తోందని, అంతర్జాతీయ గోల్ఫ్ క్రీడాకారుల పాల్గొనడం ద్వారా తెలంగాణ పర్యాటక, క్రీడా సామర్థ్యాలను ప్రపంచస్థాయిలో ప్రదర్శించే అవకాశం లభిస్తోందని మంత్రి పేర్కొన్నారు.పర్యాటక, క్రీడా రంగాల అభివృద్ధికి కపిల్ దేవ్ సేవలుతెలంగాణలో పర్యాటక, క్రీడా రంగాల అభివృద్ధికి భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ అనుభవం, సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని జూపల్లి తెలిపారు.కపిల్ దేవ్‌తో కలిసి చేపట్టే కార్యక్రమాల ద్వారా తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, క్రీడా సామర్థ్యాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తృతంగా ప్రచారం చేయవచ్చని అన్నారు.
తెలంగాణ టూరిజం సహకారంపై కపిల్ దేవ్ ప్రశంసలు
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌కు తెలంగాణ టూరిజం అందిస్తున్న నిరంతర సహకారాన్ని కపిల్ దేవ్ అభినందించారు. ఈ టోర్నమెంట్ ద్వారా తెలంగాణ, హైదరాబాద్‌ను ప్రముఖ గోల్ఫ్ టూరిజం గమ్యస్థానాలుగా ప్రచారం చేయడానికి అవకాశం లభిస్తుందని అన్నారు.హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్‌కు వేదిక కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఈ పోటీ ప్రొఫెషనల్ గోల్ఫ్‌కు మంచి వేదికగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌కు గుర్తింపు!
12వ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందని హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ జస్విందర్ సింగ్ బిర్గి తెలిపారు.ప్రముఖ ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొనడం ద్వారా హెచ్‌జీఏ సభ్యులకు అత్యున్నత స్థాయి గోల్ఫ్ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుందని చెప్పారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ కోర్స్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభిస్తుందని తెలిపారు.ఈ పోటీలో పాల్గొనే క్రీడాకారులు గోల్కొండ ఫోర్ట్ ట్రోఫీ కోసం పోటీపడనున్నారు. ఈ ట్రోఫీని టోర్నమెంట్ తొలి ఎడిషన్ సందర్భంగా హెచ్‌జీఏ ప్రారంభించింది.
రూ. కోటి ప్రైజ్‌మనీ కోసం 132 మంది గోల్ఫర్లు
సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నమెంట్ జరగనుంది. మొత్తం 132 మంది గోల్ఫర్లు రూ.1 కోటి ప్రైజ్‌మనీ కోసం పోటీపడనున్నారు. దేశంలోని ప్రముఖ ప్రొఫెషనల్ గోల్ఫర్లతో పాటు విదేశీ క్రీడాకారులు కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారు.ఈ టోర్నమెంట్‌కు అఫీషియల్ వరల్డ్ గోల్ఫ్ ర్యాంకింగ్ (OWGR) పాయింట్లు లభిస్తాయి. అలాగే రేస్ టు డీపీ వరల్డ్ ఇండియా ఛాంపియన్‌షిప్‌లో ఇది భాగంగా ఉంటుంది.ఈ పోటీ ఫలితాలు DP World PGTI నంబర్-1 ఆటగాడి ఎంపికతో పాటు సీజన్ ముగింపు DP World India Championshipకు అర్హత సాధించే టాప్-24 ఆటగాళ్ల ఎంపికలో కీలకంగా ఉంటాయి.2015లో ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ టోర్నమెంట్‌కు నిరంతరం సహకారం అందిస్తోంది.కార్యక్రమంలో DP World PGTI CEO అమన్‌దీప్ జోహల్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన అంతర్జాతీయ గోల్ఫర్ స్టెపాన్ డానెక్, అధికారులు, స్పాన్సర్లు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, పాల్గొనే గోల్ఫర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.