–కేటాయించిన పాఠశాలలకు వెళ్లని 130 మంది ఉపాధ్యాయులు!
–డిఈఓ సుశీందర్ రావు సంచలన నిర్ణయం!
–తక్షణమే విధుల్లో చేరాలని అల్టిమేటం!
–నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు త తప్పవని హెచ్చరిక!
నల్గొండ ప్రతినిధి-ప్రజా సంక్షేమం న్యూస్
జిల్లా విద్యాశాఖలో వర్క్ అడ్జస్ట్‌మెంట్ (తాత్కాలిక పని సర్దుబాటు) ప్రక్రియ తీవ్ర కలకలం రేపుతోంది.విద్యాశాఖ ఆదేశాల ప్రకారం కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరడానికి నిరాకరించిన 130 మంది ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈఓ) సుసింధర్ రావు ఉక్కుపాదం మోపారు.ఆదేశాలను ధిక్కరించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు ఉపాధ్యాయులకు ఒకేసారి భారీ స్థాయిలో షోకాజ్ నోటీసులు జారీ చేయడం జిల్లా విద్యావర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర్వులు ఇచ్చినా స్పందించని వైనం..
రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేని పాఠశాలలను గుర్తించి,అదనంగా ఉన్న ఉపాధ్యాయులను (సర్ ప్లస్) అవసరమైన చోట్లకు తాత్కాలికంగా కేటాయించారు.ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలల ఎస్జీటీ లు, ఉన్నత పాఠశాలల స్కూల్ అసిస్టెంట్ లకు సంబంధించి మొత్తం 167 మందికి గత నెల జూలై 22న డిఈఓ విధుల్లో చేరాలని పని సర్దుబాటు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, ఉత్తర్వులు జారీ చేసి రోజులు గడుస్తున్నా ఉపాధ్యాయుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. 167 మందికి గానూ కేవలం 37 మంది ఉపాధ్యాయులు మాత్రమే తమకు కేటాయించిన పాఠశాలలకు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన 130 మంది ఉపాధ్యాయులు ఇప్పటివరకు విధుల్లో చేరకపోవడాన్ని జిల్లా విద్యాశాఖ అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించింది.
లిఖితపూర్వక వివరణకు ఆదేశం..
విధుల పట్ల అనాదరణ ప్రదర్శిస్తూ, డిపార్ట్‌మెంట్ ఆదేశాలను పక్కనబెట్టిన 130 మంది ఉపాధ్యాయులకు సి సి ఏ నిబంధనల కింద డిఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
3 రోజుల గడువు..ఆధారాలు తప్పనిసరి!
నోటీసులు అందజేసిన నాటి నుంచి 3 రోజుల్లోగా తాము కేటాయించిన పాఠశాలల్లో ఎందుకు చేరలేదో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
విధుల్లో చేరకపోవడానికి గల సహేతుకమైన, బలమైన కారణాలను తగిన ఆధారాలతో సహా డిఈఓ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.
కఠిన చర్యల హెచ్చరిక..
నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వని లేదా ఇచ్చే వివరణ అసంతృప్తికరంగా ఉన్న ఉపాధ్యాయులపై విద్యాశాఖ నిబంధనల ప్రకారం శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
ఉపాధ్యాయుల గైర్హాజరు వల్ల పాఠశాలల్లో బోధనకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

