Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణకాంగ్రెస్ కోట నకిరేకల్.. రాబోయే ఎన్నికల్లోనూ ఇందిరమ్మ రాజ్యమే:సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ కోట నకిరేకల్.. రాబోయే ఎన్నికల్లోనూ ఇందిరమ్మ రాజ్యమే:సీఎం రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నకిరేకల్‌లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం,పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
రైతుల రుణమాఫీపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్:
ప్రజా సంక్షేమం న్యూస్ | నకిరేకల్:
నల్గొండ జిల్లా మొదటినుంచీ కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని కంచుకోట అని,నకిరేకల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎప్పటికీ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.శనివారం నకిరేకల్‌లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన,నూతనంగా ఏర్పాటు చేసిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.నకిరేకల్‌లో ప్రజల ఉత్సాహం చూస్తుంటే కృష్ణా,గోదావరి నదులు ఉప్పొంగినట్లుగా ఉందన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1000 రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిందని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకు, తమ 1000 రోజుల ప్రజా పాలనకు మధ్య తేడాను ప్రజలే గమనించాలని కోరారు.2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించి ఇందిరమ్మ రాజ్యాన్ని కొనసాగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రుణమాఫీపై చర్చకు సిద్ధం
రైతాంగ సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు వెచ్చించి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందని సీఎం వివరించారు. రుణమాఫీ అమలు తీరుపై సిద్దిపేట లేదా సిరిసిల్లలోనైనా,లేదంటే శాసనసభ వేదికగానైనా చర్చించేందుకు తాము సిద్ధమని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరారు.గత ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నెపంతో రైతులకు బంధు నిలిపివేసిందని విమర్శించారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యం
మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం రూ.11 వేల కోట్లు కేటాయించిందని,దీనివల్ల ప్రతి మహిళకు నెలకు రూ.10 వేల వరకు ఆదా అవుతోందని చెప్పారు.ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఉచిత బస్సు పథకాన్ని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు,పెట్రోల్ బంకులు,సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తున్నామని తెలిపారు.శిల్పారామం వద్ద రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని మహిళల ఉపాధి కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు.
సామాజిక న్యాయం-సంక్షేమ ఫలాలు
గత ప్రభుత్వంలో కేవలం ఒకే కుటుంబానికి పదవులు దక్కితే,తమ పాలనలో పేద,బడుగు,బలహీన వర్గాల నాయకులకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి గౌరవించామని సీఎం చెప్పారు.రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేయడంతో పాటు,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్,ఆరోగ్యశ్రీ వంటి పథకాలను పార్టీలతీతంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలకు కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.