డిసెంబర్ చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి:మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
అల్వాల్‌లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిని 2027 జనవరిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.డిసెంబర్ చివరి నాటికి మిగిలిన నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మంగళవారం అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్,ఆర్‌అండ్‌బీ,వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.దాదాపు మూడు గంటల పాటు ఆసుపత్రిలోని అన్ని బ్లాక్‌లు, ఓపీ విభాగం, డయాగ్నస్టిక్స్, సీటీ స్కాన్, ఎక్స్‌రే విభాగాలు, ఆపరేషన్ థియేటర్లు తదితర వైద్య విభాగాలను తనిఖీ చేశారు.అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆక్సిజన్, మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ వ్యవస్థ, ఓపీ కౌంటర్లు, హెల్ప్ డెస్క్‌లు, ఫార్మసీ, కన్సల్టేషన్ రూములు, టాయిలెట్లు, ఆపరేషన్ థియేటర్లకు అవసరమైన అనుబంధ సదుపాయాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.అల్వాల్ టిమ్స్ నిర్మాణ పనులు ప్రస్తుతం 95 శాతానికిపైగా పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి జనవరి 2027 నాటికి ఆసుపత్రిని ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.ఈ ఆసుపత్రిలో మొత్తం 1,000 పడకలు, 21 మేజర్, 7 మైనర్ ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ సదుపాయాలతో ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
న్యూరో, జెనెటిక్ సైన్సెస్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
అల్వాల్ టిమ్స్‌ను న్యూరో సైన్సెస్, జెనెటిక్ సైన్సెస్ విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. న్యూరాలజీ, న్యూరోసర్జరీతో పాటు వివిధ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. వైద్య సేవలతో పాటు పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు.కుత్బుల్లాపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధ టీచింగ్ ఆసుపత్రిగా అల్వాల్ టిమ్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా మెడికల్ కాలేజీ భవనాలు, హాస్టళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఆసుపత్రి ప్రాంగణంలో నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల సహాయకులు, బంధువుల వసతి కోసం ధర్మశాలను కూడా నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి జనవరి 2027 నాటికి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
జనవరి 2027లో అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం
RELATED ARTICLES

