బస్వాపురం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి చెరువులను నింపి సాగునీరు అందించాలి
యాదాద్రి భువనగిరి(ప్రజా సంక్షేమంన్యూస్):
బునాది గాని కాలువ వెడల్పు మరియు కల్వర్టు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రైతాంగానికి సాగు నీరు అందించాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బస్వాపురం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి ఆయా గ్రామాలలోని చెరువులను నింపి రైతులకు ఎదురవుతున్న సాగునీటి ఇబ్బందులను తీర్చాలని సూచించారు.శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన సిపిఎం పార్టీ పాదయాత్రలో వేముల బిక్షం పాల్గొని మాట్లాడారు. వర్షాలు లేక రైతులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితులలో తక్షణం బునాది గాని కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేసి రైతులందరికీ సాగునీరు అందించి ఆదుకోవాలని కోరారు.కాలువ నిర్మాణంలో భూములను కోల్పోతున్న రైతులకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నీటి పారుదల శాఖ ద్వారా ప్రభుత్వం రూ.266.65 కోట్లను మంజూరు చేసినప్పటికీ,ఇంకా పనులు ఎందుకు పూర్తి కావడం లేదని అధికారులను ప్రశ్నించారు.దాదాపు 20 ఏళ్లకు పైగా అసంపూర్తిగా ఉన్న ఈ కాలువ పనులు పూర్తయితే ఆత్మకూరు (ఎం),మోత్కూరు,అడ్డ గూడూరు మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని,వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం తగిన బాధ్యత తీసుకొని పనులను పూర్తి చేయాలని అన్నారు.బస్వాపురం ప్రాజెక్టులో ఉన్న నీటిని వెంటనే విడుదల చేసి వివిధ మండలాల్లోని చెరువులను నింపడం వల్ల రైతులకు సాగునీటి కష్టాలు తీరుతాయని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్,స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణం నీటి విడుదలకు తగు చర్యలు చేపట్టాలని వేముల బిక్షం కోరారు.

