Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

అక్టోబర్ 29న ఢిల్లీలో కర్టెన్ రైజర్.. డిసెంబర్ 7 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్
హైదరాబాద్:
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2026ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 29న ఢిల్లీలో నిర్వహించనున్న కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని సూచించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.సమ్మిట్‌ ద్వారా దేశ, విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచేలా ఉండాలని, నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికలతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ ప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు:
నవంబర్ మొదటి వారంలోగా సమ్మిట్‌కు సంబంధించిన ప్రణాళికలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి హాజరయ్యే సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పేలా హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, అవసరమైన చోట్ల డ్రోన్ ఆధారిత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.
ఏఐ, క్లైమేట్ చేంజ్ రంగాల ప్రముఖులకు ఆహ్వానం:
క్లైమేట్ చేంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులను సమ్మిట్‌కు ఆహ్వానించాలని సీఎం సూచించారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి ప్రత్యేక ప్రాధాన్యం:
గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్పకళా రూపాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ విశిష్టతను అంతర్జాతీయ అతిథులకు పరిచయం చేసేలా ప్రత్యేక డిజైన్లు, ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొని సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రికి వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.