*ఉత్తర తెలంగాణకు గేమ్‌చేంజర్.. రూ.2,278.14 కోట్లతో ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్ – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*
* 2,009.23 ఎకరాల్లో ఎయిర్‌ఫీల్డ్, సివిల్ ఏవియేషన్, కార్గో, ఎంఆర్ఓ సదుపాయాల ఏర్పాటు
* ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక, పర్యాటక, కార్గో, రక్షణ రంగాలకు భారీ ఊతం
* వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు
2026 డిసెంబర్ 31 నాటికి భూసేకరణ, మౌలిక వసతుల మార్పిడి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు
* *సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో మరో చారిత్రక అడుగు: ఆర్ అండ్ బి శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
*
హైదరాబాద్:
ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరో కీలక అడుగు పడిందని రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి *కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* తెలిపారు. ముఖ్యమంత్రి *రేవంత్ రెడ్డి* నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్‌లో ప్రతిష్ఠాత్మక *జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్* ఏర్పాటుకు రూ.2,278.14 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ఈ ప్రాజెక్టు కోసం మొత్తం *2,009.23 ఎకరాల భూమిని* సేకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో *1,609.23 ఎకరాలు భారత వైమానిక దళం (IAF)* అవసరాల కోసం, *400 ఎకరాలు సివిల్ ఏవియేషన్ ఎన్‌క్లేవ్, ఎంఆర్ఓ (MRO),* *కార్గో టెర్మినల్, హ్యాంగర్లు, భవిష్యత్ విస్తరణ అవసరాల కోసం* కేటాయించనున్నట్లు తెలిపారు.
భూసేకరణతో పాటు ఇప్పటికే ఉన్న రహదారుల మళ్లింపు, *765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల తరలింపు,* వాగుల మళ్లింపు, మిషన్ భగీరథ తాగునీటి పైప్‌లైన్ల మార్పు, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అన్ని అనుబంధ పనులకు అవసరమైన నిధులను కూడా ఈ పరిపాలనా అనుమతిలో భాగంగా కేటాయించినట్లు మంత్రి వివరించారు.
ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ రాష్ట్రానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. భారత వైమానిక దళం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న ఈ ఎయిర్‌ఫీల్డ్ వల్ల ఉత్తర తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు విశేష ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.
ముఖ్యమంత్రి *రేవంత్ రెడ్డి* ప్రత్యేక చొరవతో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో నిరంతర సమన్వయం ఫలితంగానే ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ వ్యయంతో పాటు అన్ని అడ్డంకుల తొలగింపు ఖర్చును కూడా భరిస్తోందని చెప్పారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు భూసేకరణతో పాటు రహదారులు, విద్యుత్ లైన్లు, ఇతర మౌలిక వసతుల మార్పిడి పనులను *2026 డిసెంబర్ 31* నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.
ప్రాంతీయ సమతుల అభివృద్ధే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని, ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

