

సమిష్టి ఐక్యతను చాటుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
ప్రజా సంక్షేమం న్యూస్
మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ ఏర్పాట్లపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాసబ్ ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లోని ఎస్.ఆర్. శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, బీసీల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు బీసీ నాయకులకు విజయవంతమైన ప్రాతినిధ్యం కల్పించే దిశగా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 14న ఉదయం క్యాబినెట్ సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటలకు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తినిచ్చిన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేల సేవలు, ఆశయాలను స్మరించుకునే ఈ కార్యక్రమంలో అన్ని బి.సి వర్గాలు సమిష్టిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు, విద్యార్థులు, పౌర సమాజ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున, ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమ ప్రాంగణ అలంకరణ, సభా మైదానంలో ఏర్పాట్లు, రవాణా, భద్రత, ఇతర అవసరాలకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వేదిక ఏర్పాట్లను ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా స్పష్టమైన ప్రణాళికతో రూపొందించాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లకు వారి హోదాలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన చోట ప్రత్యేక డయాస్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమం సందర్భంగా ఎలాంటి సమన్వయ లోపాలకు తావులేకుండా సంబంధిత శాఖలు, పరస్పర సమన్వయంతో పనిచేయాలని, పకడ్బందీ రూట్ మ్యాప్‌లను సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సమిష్టి బాధ్యతగా భావించి విజయవంతం చేయడానికి తమ పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.బీసీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల స్ఫూర్తితో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. పూలే పేరుతో ప్రగతి భవన్‌కు పేరు మార్చడం, ప్రస్తుత విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం వంటి చర్యలను ఆయన అభినందించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విద్యకు ఇచ్చిన ప్రాధాన్యతను, మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన మార్గదర్శక కృషిని ఆయన గుర్తుచేస్తూ, వారి ఆశయాలను ఆచరణలోకి తీసుకురావాలని అన్నారు. కుల సంఘాలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల నియామకాన్ని, వారికి కార్యాలయం, వసతి సౌకర్యాలు కల్పించేందుకు తీసుకున్న చర్యలను కూడా ఆయన స్వాగతించారు. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యక్రమంగా భావించి, బీసీ నాయకులు, సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించి, సమిష్టి ఐక్యతను చాటుతూ కార్యక్రమాన్ని ఘనవిజయం చేయాలని పిలుపునిచ్చారు.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, నెక్లెస్ రోడ్డులో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. విగ్రహావిష్కరణ వేదికను స్వయంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్ల పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు. ప్రాంగణం, వేదిక, రవాణా, భద్రత, ఇతర అవసరాలకు సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సంబంధిత శాఖలు, సమర్థవంతంగా సమన్వయం కలసి పని చేయాలని సూచించారు.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు, ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘాలు, వాటి ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక, సమర్థవంతమైన సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీసీ కుల సంఘాలు, ప్రతినిధులు తమ సహకారాన్ని అందిస్తూ పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయాలని కోరారు.బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాల మాయాదేవి సమావేశంలో పాల్గొని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గౌరవ మంత్రి గారి సూచనలను తప్పక పాటిస్తూ విగ్రహవిష్కరణ ఏర్పాటులను పకడ్బందీగా చేపట్టడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు.షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య కూడా సమావేశంలో పాల్గొని కార్యక్రమ ఏర్పాట్లకు తన సహకారాన్ని తెలిపారు.ఈ సమావేశంలో వివిధ బీసీ సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వివిధ బీసీ కుల సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సంబంధిత ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

