
కులాంతర వివాహ దంపతులకు ₹2.50 లక్షల ప్రోత్సాహక నగదు మంజూరు చేయాలి.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యుడు జిల్లా శంకర్‌కు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వినతి.
ప్రజా సంక్షేమం న్యూస్-నల్లగొండ.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు రావాల్సిన పెండింగ్ నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని, కులాంతర వివాహం చేసుకున్న అర్హులైన దంపతులకు ప్రభుత్వం ప్రకటించిన ₹2.50 లక్షల ప్రోత్సాహక పారితోషకాన్ని తక్షణమే మంజూరు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.ఈ మేరకు సంఘం నాయకులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారిని, కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
నల్లగొండ జిల్లాలో 102 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి 130 మంది బాధితులకు నష్టపరిహారం పెండింగ్‌లో ఉందని, నిధులు విడుదల కాకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నాయకులు తెలిపారు. ముఖ్యంగా హత్యలకు గురైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు కుటుంబ సభ్యులను కోల్పోయి ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ, వారికి చట్టప్రకారం అందాల్సిన పరిహారం సకాలంలో అందకపోవడం బాధాకరమన్నారు.అలాగే కుల వివక్షను అధిగమించి కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ₹2.50 లక్షల ప్రోత్సాహక పారితోషకం అనేక మంది అర్హులకు ఇప్పటికీ అందలేదని తెలిపారు. సుమారు 250 మంది కులాంతర వివాహ దంపతులకు ప్రోత్సాహక నగదు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి దంపతికి ఎలాంటి జాప్యం లేకుండా ప్రోత్సాహక నగదును విడుదల చేయాలని కోరారు.
ప్రధాన డిమాండ్లు
* నల్లగొండ జిల్లాలో 102 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 130 మంది బాధితులకు రావాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలి.
* అట్రాసిటీ హత్య కేసుల్లో బాధిత కుటుంబాలకు పూర్తి పరిహారం, పునరావాస సాయం తక్షణమే అందించాలి.
* పెండింగ్ అట్రాసిటీ కేసులపై జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, కేసుల వారీగా పరిహారం వివరాలతో జాబితా రూపొందించాలి.
* పరిహారం విడుదలలో జాప్యానికి కారణాలను సమీక్షించి, పెండింగ్ కేసులను కాలపరిమితిలో పరిష్కరించాలి.
* పెండింగ్‌లో ఉన్న సుమారు 250 మంది కులాంతర వివాహ దంపతులకు ₹2.50 లక్షల చొప్పున ప్రోత్సాహక పారితోషకం వెంటనే విడుదల చేయాలి.
* దరఖాస్తులు, ధ్రువపత్రాల పేరుతో అనవసర జాప్యం లేకుండా సరళమైన విధానంలో ప్రోత్సాహక నగదు అందించాలి.
* అట్రాసిటీ బాధితుల కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలి.
* బాధితులకు చట్టపరమైన హక్కులు, పరిహారం, పునరావాసంపై జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
* అట్రాసిటీ చట్టం అమలుపై రాష్ట్రస్థాయిలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, పెండింగ్ పరిహారాల విడుదలకు అవసరమైన బడ్జెట్ కేటాయించాలి.
* ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రత్యేకంగా జోక్యం చేసుకుని సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
* అట్రాసిటీ హత్యలకు గురైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చట్టప్రకారం 5 ఎకరాల ప్రభుత్వ భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం తదితర పునరావాస సౌకర్యాలు కల్పించాలి.
ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే అట్రాసిటీ ఘటనల్లో బాధితులకు చట్టం కల్పించిన రక్షణ, పరిహారం, పునరావాసం కాగితాలకే పరిమితం కాకుండా సకాలంలో అందినప్పుడే ప్రభుత్వంపై బాధితులకు నమ్మకం ఏర్పడుతుందని నాయకులు అన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా కుల వివక్ష నిర్మూలనకు మరింత బలం చేకూరుతుందని తెలిపారు.ఈ రెండు ప్రధాన అంశాలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, బాధితులకు మరియు కులాంతర వివాహ దంపతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ, బొల్లు రవీందర్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వంటిపాక కృష్ణ, తక్కెళ్లపల్లి శ్యామ్, బొంగరాల వెంకన్న, మాతంగి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

