ప్రపంచ స్థాయి వైద్యం తెలంగాణ ప్రజలకు అందుబాటులో!
అత్యధిక సదుపాయాలతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టీమ్స్ సనత్ నగర్ హాస్పిటల్ ప్రారంభం.
*16 అల్ట్రా మోడల్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు
*30పడకల డయాలసిస్ యూనిట్ 4 షిఫ్ట్ లో 24 గంటల సేవలు.
*ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం ప్రత్యేకంగా 100 పడకలు.
*విదేశీ రోగుల మెడికల్ టూరిజం కోసం 100 ప్రత్యేక పడకలు.
*రెండు అదనాతన క్యాద్ ల్యాబ్ లు.
*3005 ICU పడకలు.
*128 Slice సిటీ స్కాన్ & 3D టెస్లా ఎంఆర్ఐ సదుపాయాలు.
ప్రజా సంక్షేమం న్యూస్
సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నిర్మించిన ప్రతిష్ఠాత్మక డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డీఆర్‌ఎంసీఆర్ టిమ్స్) నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ఆస్పత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ రంగంలో ఒకే దశలో నిర్మించిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. మొత్తం రూ.1126 కోట్ల వ్యయంతో 22.6 ఎకరాల విస్తీర్ణంలో, 11.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో ఈ సమగ్ర వైద్య సముదాయాన్ని అభివృద్ధి చేశారు. నాలుగు బ్లాకులుగా నిర్మించిన ఈ ఆస్పత్రి 75 శాతం నీటి పొదుపుతో ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ సాధించింది. ఆరు కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో నిర్మితమైన ఈ ఆస్పత్రిలో ఏర్పాటు చేయటం విశేషం. ఈ వ్యవస్థ ద్వారా రోగుల నుంచి పరీక్షలు చేసేందుకు సేకరించిన నమూనాలు ఒకటి నుంచి రెండు నిమిషాల్లోనే సంబంధిత పరీక్షా కేంద్రాలకు చేరతాయి. ఆస్పత్రిలోని నాలుగు ప్రధాన బ్లాకుల్లో మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఇందులో ఉన్నాయి. డయాగ్నస్టిక్స్ విభాగంలో 17 పాథాలజీ ల్యాబ్‌లు, 12 మైక్రో బయాలజీ ల్యాబ్‌లు, 10 బయో కెమిస్ట్రీ ల్యాబ్‌లు, 5 ప్రత్యేక ల్యాబ్‌లు ఉన్నాయి.
పూర్తి స్థాయి వైద్య సముదాయం
సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి దశలవారీగా సంవత్సరాలపాటు కొనసాగుతుంటుంది. అందుకు భిన్నంగా టిమ్స్ సనత్‌నగర్‌ను ఒకే దశలో, ఒకే మాస్టర్‌ప్లాన్ కింద సంపూర్ణ సూపర్ స్పెషాలిటీ వైద్య సముదాయంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఆస్పత్రిలో మొత్తం 1,082 పడకలు, అందులో 300 ఐసీయూ పడకలు ఉన్నాయి. మొత్తం పడకల్లో దాదాపు 30 శాతం ఐసీయూలకు కేటాయించడం ద్వారా అత్యవసర, క్లిష్ట వైద్య సేవలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ఆస్పత్రి కోసం సర్కారు 2360 పోస్టులను కూడా మంజూరు చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు తెలంగాణ ప్రభుత్వం ఈపీసీ విధానంలో అప్పగించగా ఆ సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఆస్పత్రిలో అత్యంత ప్రత్యేకమైన సాంకేతిక సదుపాయాల్లో ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దేశంలోనే తొలిసారిగా ఈ తరహా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. సీల్డ్ ట్యూబ్‌లు, గాలి ఒత్తిడితో రక్త నమూనాలు, మందులు, వైద్య నివేదికలు, అత్యవసర వినియోగ వస్తువులను వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్‌లు, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్‌ల మధ్య కేవలం 1-2 నిమిషాల్లో ఈ విధానం ద్వారా తరలించవచ్చు. దీంతో పరీక్షల ఫలితాల కోసం సమయం తగ్గడంతోపాటు కలుషితమయ్యే ప్రమాదం తగ్గుతుంది.
6 కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
అవయవ మార్పిడి, కార్డియాక్ సైన్సెస్, ఆంకాలజీ, న్యూరోసైన్సెస్, నెఫ్రాలజీ, ట్రామా కేర్ వంటి ఆరు ప్రధాన రంగాల్లో టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దింది. కిడ్నీ, కాలేయం, గుండె, బహుళ అవయవ మార్పిడి ేసవలకు ఇక్కడ అవకాశం ఉంది. ఆధునిక కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్సలు, లీనాక్ ఆధారిత రేడియోథెరపీ, 24 గంటల అత్యవసర వైద్య సేవలు, ఐసీయూ బ్యాక్‌పతో 30 క్లినికల్ విభాగాలు అందుబాటులో ఉన్నాయి
అత్యాధునిక స్కానింగ్ సదుపాయాలు
ఆస్పత్రిలో 3.0 టెస్లా ఎంఆర్‌ఐ, 128-స్లైస్ సీటీ స్కానర్, అధునాతన మామోగ్రఫీ యూనిట్, 5 ఎక్స్‌రే యంత్రాలు ఏర్పాటు చేశారు. రోగులతో వచ్చే సహాయకుల కోసం జీ+5 అంతస్తుల్లో నిర్మించిన ధర్మశాలలో 200 మందికి వసతి సదుపాయాలున్నాయి. 30 మృతదేహాల సామర్థ్యంతో మార్చురీతో పాటు, కేంద్ర వంటశాల, లాండ్రీ, మెడికల్ ఆక్సిజన్ పైప్‌లైన్ వ్యవస్థలకు ప్రత్యేక బ్లాకులు ఇందులో నిర్మించారు. ఇక్కడ తొలుత ఓపీ సేవలను అందించనున్నారు. ఓపీతో పాటు డే కేర్ సర్జరీలు కూడా చేస్తారు. అంటే ఒకేరోజులో ఆపరేషన్ చేసి డిశ్చార్జి చేస్తారన్న మాట. నెల రోజుల తర్వాత పూర్తిస్థాయిలో ఇన్‌పేషంట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెలరోజులు ఆపరేషన్ థియేటర్ల స్టెరిలైజేషన్, ఫ్యుమిగేషన్ చేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

