ప్రజా సంక్షేమం న్యూస్ – యాదాద్రి భువనగిరి:
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ నాయకులు,ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల శాంతి కుమార్ డిమాండ్ చేశారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ,ధర్మ సమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శాంతి కుమార్ మాట్లాడుతూ.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 33 లక్షల మంది విద్యార్థులకు రూ.12 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు చెందిన బీసీ,ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు ఈ బకాయిల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కోర్సులు పూర్తయినప్పటికీ ఫీజులు చెల్లించలేదనే నెపంతో కళాశాల యాజమాన్యాలు బోనఫైడ్,ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (TC) ఇవ్వకపోవడంతో విద్యార్థుల విద్యా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులపై ఈ ఫీజుల భారం పడటం వల్ల కొంతమంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేసే పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు.కావున ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేసి నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగస్వామి,జిల్లా ప్రధాన కార్యదర్శి వెలువర్తి శ్రీకాంత్, కార్యదర్శులు సురేష్, సాయి కుమార్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ నగేష్, సాగర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

