
– ప్రభుత్వం నిర్ధారించిన 9 వరి రకాలను వేసిన రైతులు రిజిస్ట్రి చేసుకునేలా రైతు వేదికల ద్వారా తెలియజేయాలి.
– పంటల ప్రస్తుత స్థితిగతులతో మంత్రి ఆరా!
– డిపార్ట్ మెంట్ల వారిగా ఆస్థులు మరియు భూముల వివరాలు ప్రభుత్వానికి అందించాలి.
– నకిలీ డిఏపి తయారుచేసిన వారిపై కఠిన చర్యలు.. 8 మందిపై కేసులు, 6 గురు అరెస్ట్.
– మార్కెట్లలో ఆర్ డి వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి – మార్కెటింగ్ డైరెక్టర్ కు ఆదేశం.
ప్రజా సంక్షేమం న్యూస్
సచివాలయంలో తన శాఖ పరిధిలోని వివిధ శాఖలు, సంస్థల ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల పురోగతిని శాఖల వారీగా మంత్రి సమీక్షించారు. పథకాల అమలును మరింత వేగవంతం చేయాలని, రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… విబ్ జి రామ్ జి కింద ఎకో పాండ్లు మరియు వెదురు సాగు చేపట్టేలా పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సెక్రటరీని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ధారించిన 9 వరి రకాలను సాగు చేసిన రైతులు, ఎఈఓ ల దగ్గర రిజస్ట్రీ చేసుకునే విధంగా రైతువేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రస్తుత పంట పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు.
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఇప్పటివరకు రైతులకు సబ్సిడీపై ఎన్ని వ్యవసాయ యంత్రాలు అందించారనే వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. యంత్రాల పంపిణీలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. రైతులకు సేవలందించేందుకు అవసరమైన మేరకు ఉద్యోగులను భర్తీ చేసుకోవాలని, అవసరమైతే ఇతర శాఖల నుంచి సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమ పథకాల అమలులో సిబ్బంది కొరతను కారణంగా చూపించే పరిస్థితి ఉండకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.మార్క్‌ఫెడ్‌కు మంజూరైన 65 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణాలను వరి అధికంగా పండించే జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని మంత్రి సూచించారు. ఉద్యోగుల హాజరుపై రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అన్ని శాఖల్లో అమలు చేసి, ప్రతి ఉద్యోగి హాజరును అందులో నమోదు చేయాలని ఆదేశించారు. విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఒకే తరహా విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే అవకాశాలను పరిశీలించాలని వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌ను మంత్రి ఆదేశించారు. దీనివల్ల పరిపాలనా వ్యవస్థ మరింత సరళంగా మారడంతో పాటు పర్యవేక్షణ సమర్థవంతంగా ఉంటుందని అన్నారు.
ఆయిల్‌పామ్ సాగు విస్తరణలో వేగం పెంచాలి.
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణను మరింత వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో మిగిలిపోయిన మొక్కలను వెంటనే విక్రయించి, వచ్చే నెలకు కొత్త మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ జిల్లాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు మొక్కలు లేవనే సమాధానం రాకూడదని, రెండు మూడు రోజుల్లోనే వారికి మొక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.నర్సరీలు లక్ష్యం కంటే రెండింతల మొక్కలను పెంచాలని, ఖర్చు ఎంతైనా నాణ్యమైన విత్తనాలను సమకూర్చి అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన మొక్కలను రైతులకు అందించాలని ఆదేశించారు. సంవత్సరానికి 2 లక్షల ఎకరాలు లక్ష్యం పెట్టుకొని అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు. అన్ని శాఖల వద్ద ఉన్న భూములు, ఆస్తుల వివరాలను తెప్పించుకుని, నర్సరీలకు భూమి అవసరమైతే ఇతర శాఖల ఖాళీ స్థలాలను లీజు ప్రాతిపదికన వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సెక్రటరీని ఆదేశించారు. డ్రిప్ కంపెనీలతో మాట్లాడి ఆయిల్‌పామ్ కంపెనీలే రైతులకు నేరుగా డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటు చేసేలా చూడాలని సూచించారు.ఆయిల్‌పామ్ మిల్లుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ట్రయల్ రన్స్ ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన గడువులు పూర్తయిన తర్వాత కూడా పనులు కొనసాగుతున్నాయని చెప్పడం సరికాదన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు కనీసం ఒక ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతుల్లో మరింత ఉత్సాహం కలుగుతుందని అన్నారు. హైదరాబాద్‌లోని విజయ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్, మిడ్‌డే మీల్స్ కార్యక్రమాలకు అవసరమైన కూరగాయలను ఆయా ప్రాంతాల్లోని రైతుల నుంచే కొనుగోలు చేసేలా, అలాగే వంట నూనెగా విజయ ఆయిల్‌ను వినియోగించే అంశంపై హరేకృష్ణా చారిటీ ట్రస్ట్ ప్రతినిధులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.
నకిలీ డీఏపీపై కఠిన చర్యలు!
నకిలీ డీఏపీ తయారీకి సంబంధించి 8 మందిపై కేసులు నమోదు చేసి, 6 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని మంత్రి తుమ్మల ఆదేశించారు. నకిలీ డీఏపీ ఎంతమేరకు, ఎవరెవరికి విక్రయించారో పూర్తి వివరాలు సేకరించి, నష్టపోయిన రైతులకు సంబంధిత వ్యక్తుల నుంచే పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మార్కెట్లలో ఆర్‌డీ వ్యవస్థకు అడ్డుకట్ట!
మార్కెట్లలో కొనసాగుతున్న ఆర్‌డీ వ్యవస్థను సమూలంగా రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఆఫీసర్లతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్ యార్డులు, మిర్చి కోల్డ్ స్టోరేజీలను తనిఖీ చేయించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. తనిఖీలను రేపటి నుంచే ప్రారంభించి, తనిఖీ జరిగిన మరుసటి రోజే పూర్తి నివేదికను అందించాలని ఆదేశించారు.
ఆర్‌డీ వ్యవస్థ కారణంగా మార్కెట్ ఫీజుల ఆదాయానికి గండిపడటమే కాకుండా రైతులు కూడా నష్టపోతున్నారని మంత్రి తుమ్మల అన్నారు. ఈ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, కోఆపరేటివ్ కమిషనర్ రాహుల్ రాజ్, హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ, హార్టికల్చర్ యూనివర్సిటీల వీసీలు జానయ్య, రాజిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మణుడు తదితర అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి తుమ్మల.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మూడు రాష్ట్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆర్‌కేవీవై అమలులో తెలంగాణ సాధిస్తున్న ఉత్తమ పురోగతిని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న తీరును కేంద్ర మంత్రి అభినందించారు.ఈ సందర్భంగా ఆర్‌కేవీవై రెండో విడత నిధులను తెలంగాణకు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. త్వరలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పండించే పప్పు దినుసులను 100 శాతం కొనుగోలు చేయాలని, మొక్కజొన్నతో పాటు ఇతర పంటల సేకరణపై కూడా కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు.
మంత్రి తుమ్మలను కలిసిన కోస్టారికా ఏఎస్‌డీ కంపెనీ ప్రతినిధులు!
సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావును కోస్టారికా దేశానికి చెందిన ఏఎస్‌డీ కంపెనీ ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు అవసరమైన నూతన తరం, అధిక నాణ్యత గల ఆయిల్‌పామ్ విత్తనాలను కోస్టారికా నుంచి సరఫరా చేసే అంశంపై మంత్రితో చర్చించారు.కోస్టారికాలో అభివృద్ధి చేసిన నూతన తరం ఆయిల్‌పామ్ విత్తన రకాలు అధిక ఎఫ్‌ఎఫ్‌బీ దిగుబడితో పాటు అధిక OER సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ రకాల్లో Short Leaf / Compact Canopy లక్షణాలు ఉండటం వల్ల మొక్కలు తక్కువ ఎత్తులో ఆకులను విస్తరించి, ఆయిల్‌పామ్ తోటల్లో యాంత్రీకరణకు మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ఆయిల్‌పామ్‌లో తీవ్ర ప్రభావం చూపే Ganoderma వ్యాధిని తట్టుకునే సామర్థ్యం కలిగిన నూతన రకాలు కూడా తమ వద్ద అందుబాటులో ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు వివరించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతులకు ప్రయోజనం చేకూర్చే అధిక దిగుబడినిచ్చే నూతన రకాలను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కోస్టారికాలో అభివృద్ధి చేసిన ఈ నూతన రకాలపై సమగ్రంగా అధ్యయనం చేసి, తెలంగాణ వాతావరణ పరిస్థితులకు వాటి అనుకూలతను పరిశీలించి, . ఈ నూతన రకాలు తెలంగాణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే, వాటిని రాష్ట్రంలోని నర్సరీల్లో అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు.

