ప్రజాసంక్షేమం న్యూస్
రాష్ట్రంలో 22 A కింద నిషేధిత జాబితాలో నిరుపేదలకు సంబంధించిన ఆస్తులపై 30 రోజుల్లోగా న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు శాసనసభ వేదికగా ప్రకటించారు.22ఏ నిషేధిత జాబితా వివాదాల పరిష్కారానికి సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నతాధికారితో కూడిన హైపవర్ ఆఫీసర్స్ కమిటీని నియమిస్తున్నట్టు తెలిపారు.నిషేధిత జాబితా 22A పై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చపై ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు భూములకు సంబంధించి చేసిన చట్టాలు, వాటి చారిత్రక పరిణామ క్రమాన్ని సభలో వివరించారు.న్యాయమైన,చట్టబద్ధమైన అంశాల్లో నిరుపేదలకు అన్యాయం జరక్కుండా అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రధానంగా ప్రభుత్వం గుర్తించిన 12 అంశాల్లో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి గారు ఆ 12 అంశాలను సభలో వెల్లడించారు.
1.అర్బన్ ల్యాండ్ సీలింగ్ ULC భూములు :పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలు.
▪️యూఎల్సీ మిగులు భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం త్వరలోనే ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెడుతుంది.
▪️ఈ పథకం పెండింగ్‌లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులన్నింటికీ వర్తిస్తుంది.
▪️భూముల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ప్రక్రియలు రెండూ సమాంతరంగా, ఏకకాలంలో చేపడుతాం.
2.అధీకృత లేఅవుట్లలోని ప్రభుత్వ భూములు (HMDA / GHMC / DTCP) :
▪️కాంపిటెంట్ అథారిటీచే ఆమోదించబడిన లేఅవుట్లలో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పరిశీలించి, తగిన పరిష్కారం చూపేందుకు వారం రోజుల్లోగా ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తాం.
▪️ఇలాంటి ఆస్తుల క్రమబద్ధీకరణ త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెడుతుంది.
3.సింగరేణి బొగ్గు గని ప్రాంతాలు (కోల్ బెల్ట్) సమస్య :-జిల్లా స్థాయి ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేస్తాం.ఈ కమిటీ పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిర్దేశిత అర్హత ప్రమాణాల మేరకు పరిష్కరిస్తుంది.
4. జీవో నెంబర్ 59 సమస్య :
▪️కన్వెయన్స్ డీడ్స్ (హక్కు బదిలీ పత్రాలు) జారీ చేసిన 1,22,280 దరఖాస్తులను నిర్దేశిత అర్హతల ప్రాతిపదికన తుది పరిశీలన జరిపి పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది.
▪️మిగిలిన 18,590 పెండింగ్ దరఖాస్తులు నూతన క్రబద్ధీకరణ విధానం కింద పరిష్కరిస్తాం.
5. జీవో నెంబర్ 118 (ఎల్బీ నగర్ నియోజకవర్గం) :
▪️పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తాం.
▪️పరిష్కారమైన అన్ని కేసులను వెంటనే సెక్షన్ 22 A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం.
6. అసైన్డ్ భూములలో నిర్మించిన గృహాలు :
▪️అసైన్డ్ భూములన్నీ తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధ) చట్టం 1977 పరిధిలోకి వస్తున్నందున, ఈ అంశంపై సమగ్ర న్యాయ సమీక్ష మరియు విస్తృతస్థాయి సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటాం.
7. ఇందిరమ్మ పథకం – ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఇండ్లు :
▪️ఈ అంశం అత్యంత నిరుపేదల ఆస్తులకు సంబంధించినది అయినందున, దీనిపై విస్తృతస్థాయి సంప్రదింపులు జరుపుతాం.
8. ఇందిరమ్మ పథకం – లబ్ధిదారుని సొంత స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఇండ్లు :
▪️5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ (లావాదేవీల నియంత్రణ గడువు) ముగిసిన తర్వాత క్రయవిక్రయాలకు అనుమతి మంజూరు చేస్తాం.
9. ప్రైవేటు పట్టా భూములు – నాలా రుసుము చెల్లించని కేసులు :
▪️నాలా ఛార్జీలు, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములను కలిపి క్రయవిక్రయాలకు అనుమతిస్తాం.
10. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అనధికార లేఅవుట్లు, కాలనీలు :
▪️ఈ తరహా అనధికారిక లేఅవుట్లు నూతన క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తీసుకొస్తాం.
11. సికింద్రాబాద్ పరిధిలోని లీజ్ హోల్డ్ ఆస్తుల ఫ్రీహోల్డ్ క్రమబద్దీకరణ :
▪️ఇలాంటి కేసులను 30 రోజుల నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించేందుకు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం.
12. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల అసైన్మెంట్ భూములు, భూదాన్ భూములు :
▪️నిరుపేద, బలహీన వర్గాల గృహ నిర్మాణ అవసరాల కోసం భూమిని, ఆర్థిక వనరులను సమీకరించే ఉద్దేశంతో ఈ భూములను సమగ్ర ల్యాండ్ పూలింగ్ విధానం పరిధిలోకి తీసుకొస్తాం.
▪️ఈ విధానం ద్వారా సమీకరించిన నిధులను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని నిరుపేద లబ్దిదారులకు బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాలకు వినియోగిస్తాం.
22 A ఆస్తులపై 30 రోజుల్లోగా న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది:ముఖ్యమంత్రి
RELATED ARTICLES

