నల్లగొండ జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలు.. 13,765 మంది అభ్యర్థులు
పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు
నల్లగొండ, నవంబర్ 27 (ప్రజా సంక్షేమం న్యూస్): ఈ నెల 29న ఆదివారం నిర్వహించనున్న ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు నల్లగొండ జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు.తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 13,765 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నల్లగొండ, నార్కట్పల్లి మండలాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రవాణా ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకుని బస్సు సౌకర్యాలు పెంచేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ ప్రక్రియకు సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తగినంత పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు, పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక ఆంక్షలు:
పరీక్ష ప్రారంభానికి గంట ముందు మాత్రమే అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించరని ఎస్పీ స్పష్టం చేశారు. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలను తెరవడానికి అనుమతి ఉండదని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమల్లో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.పరీక్ష ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని ఎస్పీ తెలిపారు.

