Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeజాతీయంతుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎం సానుకూలత.. తెలంగాణకు శుభపరిణామం: వేముల వీరేశం

తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎం సానుకూలత.. తెలంగాణకు శుభపరిణామం: వేముల వీరేశం

📰 Generate e-Paper Clip

కాళేశ్వరం డిజైన్‌పై తీవ్ర విమర్శలు.. బీఆర్ఎస్ ప్రజలకు సమాధానం చెప్పాలి
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా సాగడం తెలంగాణకు శుభపరిణామమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించడం వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించిన ప్రజెంటేషన్‌కు మహారాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించడం రాష్ట్ర రైతాంగానికి మేలు చేసే పరిణామమని వీరేశం పేర్కొన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా సాగునీటి ప్రయోజనాలు కల్పించే అవకాశాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు.
కాళేశ్వరం రూపకల్పనపై ప్రశ్నలు:తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని స్వాగతించాల్సిన బీఆర్ఎస్ నాయకులు విమర్శలకు దిగడం సరికాదని వీరేశం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతోనే మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ విధానాలపై పలు సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటన ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత, భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిందన్నారు. ప్రాజెక్టు డిజైన్‌లో ఇంజినీర్ల పాత్ర ఎంత, అప్పటి ప్రభుత్వ పెద్దల నిర్ణయాలు ఎంతవరకు ప్రభావం చూపాయనే అంశాలపై స్పష్టత అవసరమని అన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, అప్పటి పాలకులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ వ్యయం.. సాగునీటి ప్రయోజనాలపై నిలదీత:కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు భారీగా విద్యుత్ ఖర్చవుతోందని వీరేశం విమర్శించారు. ఇంతటి వ్యయంతో నీటిని ఎత్తిపోస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో కొత్త ఆయకట్టుకు సాగునీరు అందలేదని ఆరోపించారు. నాలుగేళ్లలో ఎత్తిపోసిన నీరు, తిరిగి గోదావరిలోకి చేరిన నీటి పరిమాణం, వాస్తవంగా సాగునీరు అందిన ఆయకట్టు వివరాలను బీఆర్ఎస్ ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలను పరిశీలించాలని, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి సారించాలని సూచించారు. తక్కువ వ్యయంతో సాగునీరు అందించే అవకాశాలను పక్కనపెట్టి భారీ ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని విమర్శించారు.
రాజీనామా సవాళ్లు రాజకీయ నాటకమే:మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు రాజీనామా చేయాల్సిందని వీరేశం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో రాజీనామా సవాళ్లు విసరడం రాజకీయ నాటకంలో భాగమేనని విమర్శించారు.తెలంగాణ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు సానుకూలంగా సాగడం రాష్ట్రానికి మేలు చేస్తుందని పేర్కొంటూ, కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులు, నీటి వినియోగం, సాగునీటి ప్రయోజనాలపై బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.