Friday, October 16, 2026
prajasamkshemam news
Homeతెలంగాణతెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు హ్యుందాయ్‌కు సీఎం ఆహ్వానం

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు హ్యుందాయ్‌కు సీఎం ఆహ్వానం

📰 Generate e-Paper Clip

**రూ.8,528 కోట్ల పెట్టుబడి.. 4,276 ఉద్యోగాల కల్పనే లక్ష్యం**
**జహీరాబాద్‌ నిమ్జ్‌లో గ్లోబల్ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం.. ప్రభుత్వ సహకారం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ**
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. కార్ల తయారీ పరిశ్రమ స్థాపనకు తెలంగాణ అనువైన ప్రాంతమని పేర్కొంటూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని హ్యుందాయ్ ఇండియా సంస్థను ఆహ్వానించారు.తయారీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (HMIE) మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యోన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, జహీరాబాద్‌లో ప్రతిపాదిత పరిశోధన, అభివృద్ధి కేంద్రం పురోగతిపై చర్చించారు.
రూ.8,528 కోట్లతో భారీ ప్రాజెక్టు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ)లో రూ.8,528 కోట్ల పెట్టుబడితో హ్యుందాయ్ సమగ్ర గ్లోబల్ ఆర్‌ అండ్‌ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. సుమారు 678 ఎకరాల విస్తీర్ణంలో దశలవారీగా అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 4,276 ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న నెలల్లో కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వివరించింది.ఈ ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు సాగేందుకు అవసరమైన అనుమతులు,
మౌలిక సదుపాయాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.హైదరాబాద్‌కు అనుకూలమైన మౌలిక సదుపాయాలు
భౌగోళికంగా తెలంగాణ దేశానికి మధ్యలో ఉండటం,హైదరాబాద్‌కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మెరుగైన జీవన ప్రమాణాలు పెట్టుబడిదారులకు ప్రధాన ఆకర్షణలని రేవంత్‌రెడ్డి వివరించారు. రహదారి, విమాన, రైలు మార్గాల ద్వారా ఉన్న రవాణా సదుపాయాలు, ప్రత్యేక మొబిలిటీ క్లస్టర్లు, భవిష్యత్తులో మరింత మెరుగుపడనున్న రవాణా అనుసంధానం ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.పెరి-అర్బన్ రీజియన్ (PURE) వంటి ప్రణాళికాబద్ధమైన ప్రాంతీయ అభివృద్ధి నమూనాల ద్వారా పారిశ్రామిక విస్తరణకు తెలంగాణ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించి, 2026లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని హ్యుందాయ్ ప్రతినిధులను ఆహ్వానించారు.
### పరిశోధన, వాహన పరీక్షలకు కీలక కేంద్రం
హైదరాబాద్ హైటెక్ సిటీలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హ్యుందాయ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం అధునాతన వాహన ఇంజినీరింగ్‌కు సేవలందిస్తోంది. జహీరాబాద్‌లో ప్రతిపాదిత కేంద్రం ఏర్పాటుతో వాహనాల పరీక్షలు, పనితీరు ధ్రువీకరణ, ఇంజినీరింగ్ ప్రక్రియల మెరుగుదలకు మరింత ప్రాధాన్యం లభించనుంది.2024లో ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాల సందర్భంగా తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా హ్యుందాయ్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. అనంతరం 2025 జూన్‌లో ప్రతిపాదిత ఆర్‌ అండ్‌ డీ కేంద్రానికి రాష్ట్ర మంత్రివర్గ పారిశ్రామిక, పెట్టుబడుల ప్రోత్సాహక ఉపసంఘం ఆమోదం తెలిపింది.ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యోన్ చో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో తమ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్‌-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
PS NEWS | ప్రజా సంక్షేమం న్యూస్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.