Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణకేటీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం కౌంటర్!

కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం కౌంటర్!

📰 Generate e-Paper Clip

-కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకొచ్చి కరువు, ఎల్‌నినోపై చర్చించండి..
-బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ రైతులకు తీరని అన్యాయం..
-రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసింది
ప్రజా సంక్షేమం న్యూస్ | హైదరాబాద్:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ పర్యటనలో అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ రైతులకు ఎలాంటి న్యాయం చేయలేదని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే సుమారు రెండు లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి ఆదిలాబాద్ రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు.కేటీఆర్ వేషం, భాష మార్చుకున్నంత మాత్రాన ప్రజలు గత పాలనను మరిచిపోరని, మారాల్సింది ఆయన ఆలోచనా విధానమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడమే బీఆర్ఎస్ నాయకుల పనిగా మారిందని అన్నారు.రాష్ట్రంలో కరువు, ఎల్‌నినో ప్రభావంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకొచ్చి ఈ అంశాలపై చర్చించాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్నట్లు చెబుతున్న రూ.1,500 కోట్లను రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఇప్పటికే రూ.1.70 లక్షల కోట్లను ఖర్చు చేసిందని తెలిపారు.కేసీఆర్ హయాంలో రాష్ట్రంపై సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం పడిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో చోటుచేసుకున్న పరిణామాలకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు జరిగిన సమయంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.మియాపూర్ భూముల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుతో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం చేకూరిందని విమర్శించారు.కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారని వివరించారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.