ప్రజల ఆరోగ్యం.. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి
9+9+9 ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు రూపకల్పన
వివిధ క్రీడాంశాల్లో లీగ్ పోటీలకు ప్రోత్సాహం
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణలో క్రీడా సంస్కృతిని మరింత విస్తృతం చేయడంతో పాటు, శారీరక చైతన్యాన్ని ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయడం లక్ష్యంగా “ఖేలో తెలంగాణ” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ క్రీడా శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిరంతర క్రీడా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణరూపొందిస్తున్నారు.సచివాలయంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి “ఖేలో తెలంగాణ” పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్,స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డితో పాటు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
30 నిమిషాల ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం:
“ఖేలో తెలంగాణ బంధన్”లో భాగంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించేలా ప్రజలను ప్రోత్సహించనున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా తమకు అనువైన నడక, జాగింగ్, యోగా తదితర శారీరక వ్యాయామాలను నిత్య జీవితంలో భాగం చేసుకునేలా అవగాహన కల్పించనున్నారు.
9+9+9 ఫిట్‌నెస్ ఛాలెంజ్:ఫిట్‌నెస్‌పై ప్రజల్లో ఆసక్తిని పెంచేందుకు **“9+9+9 ఫిట్‌నెస్ ఛాలెంజ్”**ను నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా వాకింగ్,జాగింగ్, యోగా తదితర వ్యాయామాల్లో పాల్గొంటూ 27 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అనంతరం 9 మంది మిత్రులను ట్యాగ్ చేసి,మరో 9 మందిని ఛాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.ఒకరి నుంచి మరొకరికి ఫిట్‌నెస్ సందేశం విస్తరించేలా ఈ కార్యక్రమాన్ని ప్రజా భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లనున్నారు.
వివిధ క్రీడల్లో లీగ్ పోటీలు:“ఖేలో తెలంగాణ”ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా నిరంతర క్రీడా ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు వివిధ క్రీడాంశాల్లో లీగ్ పోటీలను ప్రోత్సహించనున్నారు. పాఠశాల స్థాయి నుంచి అన్ని వయస్సుల వారికి క్రీడల్లో పాల్గొనే అవకాశాలను పెంచడంతో పాటు క్రీడలపై ఆసక్తి, అవగాహన, ప్రేక్షకాదరణను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.రెజ్లింగ్, బాక్సింగ్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, జూడో, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, సైక్లింగ్, యోగాసన తదితర క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించేందుకు స్పోర్ట్స్ అథారిటీ కార్యాచరణ రూపొందిస్తోంది.
బలమైన క్రీడా సంస్కృతే లక్ష్యం:ఫిట్‌నెస్‌ను ప్రజల జీవనశైలిలో భాగం చేయడం, క్రీడలను ప్రజలందరికీ చేరువ చేయడం, క్రీడా ప్రతిభకు మరిన్ని వేదికలు కల్పించడం, తెలంగాణలో బలమైన క్రీడా సంస్కృతిని నిర్మించడం “ఖేలో తెలంగాణ” ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఇందుకోసం దశలవారీగా నిరంతర కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్రీడాభిమానులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత, విద్యాసంస్థలు, క్రీడా సంఘాలు, ఫిట్‌నెస్ ప్రేమికులు, యావత్తు తెలంగాణ క్రీడా సమాజం భాగస్వాములు కావాలని మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి విజ్ఞప్తి చేశారు.
ఖేలో తెలంగాణ.. నిరంతర క్రీడా ఉద్యమానికి శ్రీకారం:క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
RELATED ARTICLES

